శాట్, యాక్ట్ పరీక్షల్లో ‘అపూర్వ’ ప్రతిభ

విద్యార్ధుల మేధస్సును అంచనా వేసేందుకు అమెరికాలో నిర్వహించే రెండు పరీక్షల్లో అత్యద్భుత నైపుణ్యం ప్రదర్శించి ఓ తెలుగమ్మాయి మన దేశానికి గర్వకారణంలా నిలిచింది. అమెరికాలో ఇటీవల జరిగిన ‘శాట్’ (స్కాలర్‌షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్), ‘యాక్ట్’ (అమెరికన్ కాలేజ్ టెస్టింగ్) పరీక్షల్లో హైదరాబాద్‌కు చెందిన కనె్నగంటి అపూర్వ (16) మంచి స్కోర్ సాధించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. మెంఫిస్ (అమెరికా)లోని జర్మన్‌టౌన్ హైస్కూల్‌లో చదువుతున్న ఆమె ఎవరూ సాధించలేని రీతిలో ‘యాక్ట్’లో 36, ‘శాట్’లో 2,400 స్కోర్ సాధించింది. హైదరాబాద్‌లో జన్మించిన అపూర్వ రెండేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లింది. కొత్తగూడెంకు చెందిన ఆమె తల్లి తిరుమల దేవి మెంఫిస్‌లోని సెంట్ జుడెస్ రీసెర్చి ఆస్పత్రిలో ప్రొఫెసర్‌గా, గుంటూరుకు చెందిన తండ్రి సంజీవరావు ఐటి రంగంలో పనిచేస్తున్నారు. సాధారణంగా ‘శాట్’లో 0.02 శాతం మంది, ‘యాక్ట్’లో 0.06 శాతం మంది విద్యార్థులు మాత్రమే సంతృప్తికరమైన స్కోర్‌ను సాధిస్తుంటారని, ఈ రెండు పరీక్షల్లో అపూర్వ అంచనాలకు మించి ప్రతిభ చూపడం తమకు ఆశ్చర్యం కలిగించిందని పరీక్షల నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికాలో నిర్వహించే ‘శాట్’, ‘యాక్ట్’ పరీక్షలు విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. విద్యార్థుల్లో మేధో నైపుణ్యం, వివేచన, శాస్ర్తియ అవగాహన, భాషపై పట్టు వంటి విషయాలను అంచనా వేసి, ‘శాట్’లో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు మంజూరు చేస్తుంటారు. గణితం, ఆంగ్లం, పఠనం, సైన్స్, రాతకు సంబంధించి నైపుణ్యం తెలుసుకునేందుకు ‘యాక్ట్’ నిర్వహిస్తుంటారు.తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే తాను ఇంతటి ఘనతను సాధించగలిగానని అపూర్వ ఎంతో వినమ్రంగా చెబుతోంది. మిగతా అందరు పిల్లల్లాగే తాను కూడా సరదాగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంటానని, అదే సమయంలో చదువుపై కూడా దృష్టి సారిస్తుంటానని ఆమె చెబుతోంది. భవిష్యత్‌లో డాక్టర్‌గా సేవలించాలన్నదే తన లక్ష్యమని, ప్రజలకు సేవ చేసేందుకు వైద్యవృత్తి దోహదపడుతుందని ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. తాను సాధించిన స్కాలర్‌షిప్‌లు మెడిసిన్ చదివేందుకు ఎంతో ఉపయోగపడతాయని అంటోంది. శాస్ర్తియ రంగంలో పరిశోధనలు చేయాలన్నది తన ఏకైక తపన అని చెబుతున్న ఆమె ఇప్పటికే అమెరికాలో బ్రాడ్ ఇనిస్టిట్యూట్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్ విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదవలాన్న తన ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. తెలుగువారు నిర్వహిస్తున్న మెంఫిస్ యువజన సంఘం అధ్యక్షురాలిగా సేవలందిస్తున్న ఆమెకు పాటలు పాడడం, నృత్యం చేయడం అంటే ఎంతో మక్కువ. ప్రస్తుతం కూచిపూటి నాట్యంలో శిక్షణ పొందుతోంది. వస్త్రాలంకరణ అంటే ఇష్టపడే ఆమె స్కూల్ ఫంక్షన్లలో బాలీవుడ్ సినిమాల్లోని వేషధారణలతో అందరినీ మెప్పిస్తుంటుంది. చదువులోనూ ఏకాగ్రత చూపుతూ ఈ ఏడాది ‘స్కూల్ టాపర్’గా నిలిచింది. మార్కుల విషయమై తల్లిదండ్రులు ఏనాడూ తనపై ఒత్తిడి చేయలేదని, ఈ కారణంగానే తాను ‘శాట్’లో, ‘యాక్ట్’లో మంచి స్కోర్ సాధించానని అపూర్వ తెలిపింది. అన్నింటినీ ఆస్వాదిస్తూ జీవితాన్ని సరదాగా గడపాలని, అదే సమయంలో చదువుపట్ల ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదని ఆమె అంటోంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved