అమెరికాలో కరుగుతున్న సొంతింటి కల

గృహ నిర్మాణ మార్కెట్‌ కుప్పకూలటంతో 2007లో చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం 2009 జూన్‌లో అధికారికంగా ముగిసినప్పటికీ గడచిన ఆరేళ్ల కాలంలో అమెరికాలో సొంత ఇంటి కల క్రమంగా కరిగిపోతున్నట్టే కన్పిస్తోంది. తమ దేశంలో నిరుద్యోగిత తగ్గిందని ఒబామా సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిపో యింది. వేతనాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపో వటంతో పాటు తడిసి మోపెడవుతున్న విద్యారుణాల భారం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు. హార్వర్డ్‌ యూనివర్శిటీకి చెందిన జాయింట్‌ సెంటర్‌ ఫర్‌ హౌసింగ్‌ స్టడీస్‌ తన తాజా అధ్యయన నివేదికలో నిగ్గుతేల్చిన నిజాలివి

ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చెప్పుకుంటున్న అమెరికా లోని వివిధ వర్గాల ప్రజల ఆర్థిక దుస్థితిని మన కళ్లకు కడుతోందీ నివేదిక. 'ది స్టేట్‌ ఆఫ్‌ నేషన్స్‌ హౌసింగ్‌ 2015′ అన్న పేరుతో విడుదలయిన ఈ నివేదికలో సొంత ఇంటి యజమానుల సంఖ్యం గత ఏడాది 64.5 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. అమెరికా జనగణన లెక్కల ప్రకారం గత రెండు దశాబ్దాల కాలంలో ఇదే అతి తక్కువ. మూడు దశాబ్దాల క్రితం 1985 నాటి నుండి ఎటువంటి మార్పూలేని సొంతింటి దారుల సంఖ్య పదే ళ్ల క్రితం 2004కూడా జనాభాలో 69 శాతం వుండగా ఇప్పుడు దానికన్నా తక్కువకు చేరుకోవటం మాంద్య పరిస్థితుల తీవ్రతకు అద్దంపడుతోంది. సొంతింటి కల కరిగిపోతుండటం అన్ని వర్గాల వారినీ ప్రభావితం చేస్తున్నా ఎక్కువగా ప్రభావితులైంది మాత్రం యువతరమే. దేశ జనాభాలో సొంతిల్లు కలిగివున్న 25-35 ఏళ్ల మధ్య వయస్కుల జనాభా మూడోవంతుకు పడిపో యింది. 1993 నాటి పరిస్థితితో పోల్చుకుంటే 35-44 ఏళ్ల మధ్య వయస్కు లయిన ఇంటి యజమానుల సంఖ్య 5.4 శాతం మేర తగ్గిపోయింది. ఈ పరిస్థితికి ప్రధానంగా ఆయా వర్గాల కుటుంబ ఆదాయంలో గండిపడటం, దీర్ఘకాలిక నిరుద్యోగిత కొనసాగుతుండటం, ముఖ్యంగా పరపతి సౌకర్యం కఠినతరం కావటమే కారణాలని ఈ నివేదిక విశ్లేషించింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved