ఆ ఫోటో అతడి జీవితాన్ని మలుపు తిప్పింది

కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమంలో ఓ ఫొటో బాగా షేర్‌ అవుతోంది. ఫిలిప్పైన్స్‌లోని సెబు దీవుల్లో.. మెక్‌ డోనాల్డ్‌ దుకాణం ముందు వీధి దీపాల వెలుగులో ఓ విద్యార్థి చదువుకుంటున్న ఫొటో అది. ఓ స్థానిక వైద్య విద్యార్థి ఈ నెలరోజుల క్రితం దీన్ని ఫేస్‌బుక్‌లో పెట్టాడు. 'ఈ బాలుడే నాకు స్ఫూర్తి' అంటూ చేసిన ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో ఏడువేల సార్లు షేర్‌ అయింది. ఆ ఫొటోనే.. పేదరికంలో ఉన్నా.. చదువుపై ఆసక్తి చూపుతున్న 9ఏళ్ల డేనియల్‌ కాబ్రెరాపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ పోస్టు చూసి కదిలిపోయిన చాలా మంది.. డబ్బులు, స్కాలర్‌షిప్‌లు, రీడింగ్‌ ల్యాంప్‌, స్టేషనరీ వస్తువులను ఆ చిన్నారికి పంపిస్తున్నారు. డేనియల్‌ తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి ఓ కిరాణా దుకాణంలో, చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఐదేళ్ల క్రితం వీరి ఇల్లు అగ్నికి ఆహుతవ్వటంతో.. ఆ కిరాణా దుకాణంలోనే.. ఓ మూలన వీరిద్దరు ఉంటున్నారు. ''చిన్నప్పటి నుంచి చదువుపై డేనియల్‌కు ఆసక్తి ఉంది. 'పేదరికంలో మనం బతకొద్దు. నా కలలను సాకారం చేసుకుంటా'నని డేనియల్‌ చెప్పేవాడు. పేదరికం వల్ల ఓ పూట భోజనం లేకపోయినా.. స్కూలుకు మాత్రం వెళ్లేవాడ''ని ఈ బాలుడి తల్లి తెలిపింది. ఇప్పుడా కల సాకారానికి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved