ఇకపై ఏటిఎం కార్డు అవసరం ఉండదట!

ఏటిఎం మెషిన్ నుంచి డబ్బు డ్రా చేయాలంటే.. ఇకపై కార్డు అవసరం ఉండదని చెబుతున్నారు చైనా పరిశోధకులు. ఏటిఎం కార్డును ఇంట్లో మర్చిపోయి రావడం, లేక ఎవరైనా కార్డును దొంగిలించడం లాంటి కష్టాలు ఇకపై ఉండవని వారు చెబుతున్నారు. డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లే ప్రతిసారీ... కార్డు ఎక్కడ పెట్టామో వెతుక్కోవాల్సిన పని లేకుండా.. ఒట్టిచేతులతో వెళ్లి మిషిన్ ముందు నిలబడితే మీకు కావలసినంత డబ్బు ఇచ్చేవిధంగా ఏటియం మెషిన్లను తయారు చేశారంట. అదెలాగంటే...

ఇప్పుడంతా బయోమెట్రిక్ టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఇంటా, బయటా, ఆఫీసుల్లో.. ఈ-పోస్ పుణ్యమా అని ఆఖరికి రేషన్ దుకాణంలో కూడా వేలి ముద్ర ఆధారంగా పనులు జరిగిపోతున్నాయి. ఈ బయోమెట్రిక్ టెక్నాలజీకే మరికొన్ని మెరుగులుదిద్ది ఓ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశామని, అదే ‘ఫేస్ రికగ్నిషన్’ అని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటిఎం మెషిన్‌కు ఉన్న కెమెరా ముందు మన ముఖాన్ని ఉంచితే.. అది స్కాన్ చేసి మన అకౌంట్‌ను యాక్సెస్ చేస్తుందట. అంటే మన ముఖాన్నే ఏటిఎం కార్డులా వాడుకుని మనకు డబ్బులిస్తుందట. ‘‘ఫేస్ స్కాన్ అవగానే.. పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడుగుతుంది. పాస్‌వర్డ్ ఎంటర్ చేసి మీ ఖాతా లావాదేవీలు జరుపుకోవచ్చు.’’ అని చైనా మర్చంట్ బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇలాంటి మిషన్లను వివిధ నగరాల్లో ఏర్పాటు చేశామని, అన్ని బ్యాంకులకు సంబంధించిన ఖాతాల లావాదేవీలను ఈ మిషన్ల ద్వారా జరుపుకోవచ్చని వారు చెబుతున్నారు. ఈ సరికొత్త విధానంతో అర నిమిషంలోనే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని వారు తెలిపారు.

ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అత్యంత పకడ్బందీగా అభివృద్ధి చేశామని, వినియోగదారులు కళ్లజోడు పెట్టుకున్నా, మేకప్ వేసుకున్నా కూడా వారి ముఖాన్ని స్పష్టంగా గుర్తుపడుతుందని, కవలలు వచ్చినా కూడా ఈ మెషిన్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి అకౌంట్ వారికే యాక్సెస్ చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖం మొత్తం మారిపోయేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే మాత్రం బ్యాంకుకు వెళ్లి మరోసారి ఫేస్‌ను స్కాన్ చేయించుకోవాలని వారు సూచించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved