నెయ్యి ప్యాకెట్లు కొంటున్నారా? అయితే ఒక్క క్షణం...

నకిలీ బ్రాండ్ల ముసుగులో నెయ్యి వ్యాపారం

ప్రజారోగ్యంతో చెలగాటం

నెయ్యి పేరిట రసాయన మిశ్రమాల అమ్మకం

లక్షల రూపాయల్లో వ్యాపారం

పోలీసుల దాడితో గుట్టు రట్టు

ఇది కల్తీ నెయ్యి అంటే ఎవరూ నమ్మరు. రంగు, వాసన అంతా అసలు సిసలు నేతినే పోలి ఉంటుంది. తరచి చూస్తేనే లోగుట్టు తెలిసేది. ప్రమాదకర రసాయనాలతో తయారై, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ నకిలీ నెయ్యి జిల్లాలోని అడవినెక్కలం కనసాని పల్లెలో గుట్టుగా తయారవుతోంది. ఈ కల్తీ నెయ్యి జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళుతోంది. శుక్రవారం ఈ కల్తీ పరిశ్రమపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి సీజ్‌చేశారు. పెద్ద కోట గోడల వెనుక రహస్యంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పసిగట్టిన ఏసీపీ ప్రసాద్‌, ఎస్సై జి.శ్రీనివాస్‌ అక్కడ తయారవుతున్న కల్తీ నేతిని చూసి అవాక్కయ్యారు...

జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న కల్తీ నెయ్యి తయారీ స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం దాడి చేసి సీజ్‌ చేశారు. భారతీనగర్‌ నాలుగో లేనలోని ఓ ప్లాట్‌ కేంద్రంగా కల్తీ నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయి. నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌కు ఈ విషయంపై మూడు రోజుల క్రితం సమాచారం వచ్చింది. దీన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు కేసు అప్పగించడంతో ఆ స్థావరంపై దాడి చేసి పది వేలకు పైగా వివిధ బ్రాండ్లకు చెందిన నెయ్యి కవర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలాగే గతంలో అజితసింగ్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఈ రెండింటి ఆధారంగా కూపీ లాగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం కల్తీ నెయ్యి కేంద్రం కృష్ణా జిల్లా అడవినెక్కలం గ్రామం కనసాని పల్లె రోడ్డులో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ కేంద్రంలో కేవలం అర్ధరాత్రి తర్వాతే ఉత్పత్తి మొదలవుతుంది. స్థానికులకు అందులో ఏం తయారవుతుందనేది తెలీదు. గతంలో రబ్బర్‌ ఫ్యాక్టరీ ఉన్న గోడౌనను తీసుకున్న ఆవుల ఫణి కుమార్‌ అనే వ్యాపారి గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు.

ఇందులో పని చేసే వారిని కూడా నున్న, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి తీసుకువస్తుండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అంతే కాకుండా ఈ పరిశ్రమకు విద్యుత కనెక్షన తీసుకోకుండా ఒక జనరేటర్‌ను ఉపయోగించి తయారీ నిర్వహిస్తున్నారంటే పక్కా ప్రణాళికతో కల్తీ నెయ్యి తయారీ జరుగుతుందో అర్థమవుతోందని టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఏఆర్‌పీవీబీ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఆవుల ఫణి గతంలో కూడా సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఇదే విధంగా కల్తీ నెయ్యి తయారీ చేస్తూ అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై వచ్చి తిరిగి మొదలుపెట్టాడు. అయితే ఈ సారి నగరంలో కాకుండా జిల్లాలోని మారుమూల గ్రామంలో ’ఐశ్వర్య ఆయిల్‌ ఇండసీ్ట్రస్‌’ అనే ఒక కంపెనీ పేరుతో ప్రారంభించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కరెంట్‌ కనెక్షన లేకుండా ఎవరికీ సంబంధం లేకుండా అర్ధరాత్ర్లి పరిశ్రమను నిర్వహిస్తుండడంతో అతడి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. అయితే కొద్ది రోజుల క్రితం కొత్తపేట పోలీస్‌ స్టేషన పరిధిలో రూ. ఐదు లక్షల విలువైన కల్తీ నెయ్యి స్వాధీనం కావడంతో మిగిలిన వాటిపై కూడా దృష్టి సారించారు.

కార్తీక మాసం కావడంతో నెయ్యి వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆవుల ఫణి ప్రముఖ బ్రాండ్‌కు నకిలీగా ’శ్రీ దుర్గా, శివ దుర్గా, విజయ దుర్గా, నవ దుర్గా, లక్ష్మీ దుర్గా’ తదితర 10 పేర్లతో అదే తరహాలో తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాడు. ముఖ్యంగా తూర్పు జిల్లాలు, ఒడిశాకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. దాదాపు ఒకటిన్నర ఎకరంలో విస్తరించిన ఈ ఫ్యాక్టరీ గోడలు సైతం ఎత్తుగా ఉండడంతో కేవలం లోపలకు వెళ్లే వ్యాపారులకు మినహా ఏం తయారవుతోందనేది ఎవరికీ తెలియదని స్థానికులు తెలిపారు. అయితే తయారీ చేసే ప్రాంతం అపరిశుభ్రంగా ఉండడం, దీనికిఉపయోగించే కెమికల్స్‌, వాటి వాసనను పరిశీలించిన వారంతా ఇవి చాలా ప్రమాదకరమైనవని, జీర్ణ వ్యవస్థను దెబ్బ తీస్తాయని చెప్పారు. తయారీలో కేవలం ఐదు నుంచి పది శాతం మాత్రమే నెయ్యిని ఉపయోగించి, పెద్ద మొత్తంలో డాల్డా, గోదారి, రైస్‌ బ్రాన ఆయిల్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా రుచి, వాసన రంగుల కోసం వివిధ రకాల కెమికల్స్‌ను కూడా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved