ఆ బాలిక చ‌నిపోయినా ఆమె అవ‌య‌వాలు ముగ్గురికి ప్రాణ‌దానం చేశాయి..!

ఆ బాలిక పేరు కేజ‌ల్ పాండే. ఈ మ‌ధ్యే సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసింది. చార్టెడ్ అకౌంటెంట్ అయి ఎంతో ఉన్న‌త స్థానాన్ని చేరుకోవాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ అంత‌లోనే మృత్యువు ఆమెను యాక్సిడెంట్ రూపంలో క‌బ‌లించుకుపోయింది. దీంతో ఆ బాలిక కుటుంబ స‌భ్యులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. అప్ప‌టి వ‌ర‌కు త‌మ ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన త‌మ కూతురు ఒక్క‌సారిగా ఎవ‌రో తీసుకుపోయినట్టుగా త‌మ ముందు నుంచి అదృశ్య‌మ‌య్యే సరికి ఆ త‌ల్లిదండ్రులు ప‌డుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఈ క్ర‌మంలో వారి కుటుంబంలో తీవ్ర‌మైన విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కానీ అంత‌టి విషాదంలోనూ ఆ బాలిక త‌ల్లిదండ్రులు ఎంతో ఉన్న‌తంగా ఆలోచించి ఓ గొప్ప కార్యం చేశారు.

ముంబైలో నివాసం ఉండే కేజ‌ల్ పాండే అనే బాలిక‌కు 16 ఏళ్లు. ఈ నెల 26వ తేదీన కేజ‌ల్ త‌న త‌ల్లితో క‌లిసి టూవీల‌ర్‌పై వెళ్తోంది. కాగా థానే వ‌ద్ద ర‌హ‌దారిపై వెళ్తుండ‌గా అక‌స్మాత్తుగా వ‌చ్చిన ఓ కారు కేజ‌ల్ వాహ‌నాన్ని ఢీకొట్టింది. దీంతో కేజ‌ల్‌కు, ఆమె త‌ల్లికి తీవ్ర గాయాల‌య్యాయి. హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అక్క‌డి వైద్యులు కేజ‌ల్ అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్టు చెప్పారు. మెద‌డులో తీవ్ర‌మైన ర‌క్త‌స్రావం అవ‌డంతో ఆమె చ‌నిపోయింద‌ని వారు తేల్చారు. దీంతో కేజ‌ల్ కుటుంబ‌మంతా విషాదంలో మునిగిపోయింది. మ‌రో 3 రోజుల్లో సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌వుతాయ‌న‌గా ఆ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం వారిని ఎంత‌గానో క‌ల‌చివేసింది. అయితే ఆ స‌మయంలో కేజ‌ల్ త‌ల్లిదండ్రులు మాత్రం ఎంతో ఉన్న‌తంగా ఆలోచించారు. త‌మ కూతురి అవ‌య‌వాల‌ను వారు దానం చేశారు. కేజ‌ల్ మూత్ర‌పిండాల‌ను ఇద్ద‌రు పేషెంట్ల‌కు, లివ‌ర్‌ను మ‌రో పేషెంట్‌కు వారు ఇచ్చారు. దీంతో ఆ పేషెంట్ల‌కు వారు పున‌ర్జ‌న్మ ప్ర‌సాదించిన‌ట్ట‌యింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved