దాన్ని జయించలేమా?

దాదాపు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఏదో ఒక సందర్భంలో కోపాన్ని ప్రదర్శిస్తారు. కోపం అనేది ఎవరికీ అకారణంగా రాదు. అనుకున్న పని కాకపోయినా, మనకి నచ్చని పని ఎవరు చేసినా చిరాకు, విసుగు కలుగుతాయి. ఆ సమయంలోనే కోపం, ఆవేశం బయటకు వస్తాయి. కోపం వల్ల మనిషి తన ఉనికిని, వివేకాన్ని కోల్పోతాడు. ఆవేశపూరితమైన ఆగ్రహం అన్ని విధాలా అనర్థదాయకమే. క్షణికావేశంతో కోపంతో చేసే పనులు చేటు కలిగిస్తాయి. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని సైతం కోపం ఆవహించిన వ్యక్తి విస్మరించే అవకాశం వుంది. కోపం వల్ల కొన్నిసార్లు ప్రయోజనాలు ఉంటాయని కొంతమంది వాదిస్తుంటారు. అందుకే వారు కోపాన్ని అధిగమించే ప్రయత్నం చేయరు. ఉదాహరణకు పిల్లలపై కోపంతో తల్లి నాలుగు దెబ్బలు వేస్తుంది. ఆ సమయంలో పిల్లలకు కూడా తల్లిమీద కోపం వస్తుంది. కానీ, వారు తల్లిని ప్రతిఘటించలేరు. ఇక్కడ తల్లి కోపానికి ‘క్రమశిక్షణ’ అని అర్థం చెబుతాం. ఆ కోపం పర్యవసానం ఏమిటో ఆమె పెద్దగా పట్టించుకోదు. ఇలాంటి కోపం నిత్యకృత్యమైతే పిల్లల్లో అవాంఛనీయ లక్షణాలు పెరుగుతాయి. గనుక తల్లిదండ్రులు పిల్లలను కోపంతో కాక ప్రేమతో మృదువుగా మందలించే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. కోపాన్ని అధిగమించాలంటే ఓర్పు, సహనం అవసరం. ధ్యానం ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చు. సరైన దృక్పథం, అభిలాష, వాక్కు, ప్రవర్తన, జీవన విధానం, ప్రయత్నం, చింతనాసరళి, ధ్యానం వంటి అష్టాంగ మార్గాలతో కోపాన్ని జయించవచ్చు అని పెద్దలు చెబుతారు.ఇతరుల్లోని దోషాలను ఎత్తిచూపడం మానేసి, మనలోని తప్పులను వెతుక్కోవాలి. ‘నేను’ అనే అహంభావాన్ని రూపుమాపుతూ, మనలో వున్న క్షమాగుణాన్ని వెలికితీయగలిగితే కోపం, ఆవేశం మన అధీనంలో వుంటాయి. దీనికి నిత్యసాధన అవసరం.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved