నటోమాస్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో దసరా,బతుకమ్మ

కాలిఫోర్నియాలోని శాక్రిమెంటొ నగరంలో ఉన్న నటోమాస్ గ్రూప్ ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవ బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. 900 మంది ప్రవాసులు ఈ కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తుల్లో హాజరయి తెలుగుదనాన్ని ప్రతిబింబించారు. వేదపండితులు గౌరీ మాతను పూజించిన అనంతరం 9 రకాల రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మను పూజించి తరువాత ఓలలాడించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆద్యంతము ఉల్లాసంగా పాల్గొని, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ రాగయుక్తంగా పాడుతూ చేసిన నృత్యాలు ఆహుతులకు కనువిందు చేశాయి. ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా ఆ దేవి అనుగ్రహమును పొందడమే కాకుండా మన సాంప్రదాయాల మీదున్న గౌరవాన్ని, నమ్మకాన్ని మరొక్కసారి మనః పూర్వకముగా నిరూపించారు. భోజనానంతరము జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యతం ఒకే ఉత్సాహం, ఉల్లాసంతో కొనసాగి అందరినీ అలరించాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ గాయనీమణి సుమంగళి తనదైన బాణిలో, పాటల ఒరవడిలో శ్రోతలను అలరించారు. పాటలు పాడిన ఇతర గాయనీ గాయకులు, సాకేత్, నిహారిక మరియు కీర్తి కూడా ఎంతో చక్కని ప్రతిభను కనపరిచారు. స్థానిక చిన్నారుల నృత్యవిన్యాసాలు ఆహ్లాదాన్ని కలిగించాయి. ఈ వేడుకల ప్రధాన నిర్వాహకులు వెంకట్ మేచినేని మాట్లాడుతూ తమ తోటి స్నేహితులు, ఆప్తుల అండదండలు మరియు సేవాదీక్షలు ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోనుటకు దోహదపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమము ద్వారా ఎంతో ఆనందాన్ని, అనుభూతులను, మధురస్మృతులను పొందామని, అందరు సుఖ సంతోషాలతో జీవించాలని అందుకు దేవతల అనుగ్రహము ఉంటుందని నమ్ముతూ, ఈ కార్యక్రమము ఇంత దిగ్విజయముగా జరిగేందుకు సహకరించిన దాతలకు, పాల్గొన్న ప్రవాసులకు ధన్యవాదాలు తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved