భళా బార్లీ

బార్లీ అనగానే అదేదో వంటికి నీరుపడితే తాగేదే అని తీసిపారేయకండి. దీన్ని ఎక్కువగా మన పెద్దలు గర్భిణులకు నీరు పట్టినప్పుడు వాడేవారు. కానీ దీనిలో బోలెడు గుణాలున్నాయని ఆహారనిపుణులు చెప్తున్నారు. బి.పి నియంత్రణలో ఉండాలన్నా, కిడ్నీలో రాళ్లు కరగాలన్నా, మూత్రం సాఫీగా అవ్వాలన్నా బార్లీ నీళ్లు తాగమని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే బార్లీ తప్పక వాడాల్సిందే అనేంతగా బార్లీ తన ప్రాధాన్యతను ఇటీవల పెంచేసుకుంది. ప్రకృతి వైద్యంలో బార్లీ తప్పనిసరి. ఇంచుమించు గోధుమల్లాగే కనిపించే బార్లీకి 13 వేల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, బార్లీని ముందుగా టిబెటెన్లు తమ వంటకాలలో వాడరని చెప్తారు. ఆ తర్వాత మధ్య యూరప్‌కి ఈ పంట విస్తరించింది. ఆఫ్రికన్లు కూడా బార్లీ పంటను విస్తృతంగా సేద్యం చేస్తున్నారు. బార్లీ గింజకు ఉండే గట్టిదనం వల్ల పై పొట్టు అతుక్కునే ఉంటుంది. ఒకరకంగా ముత్యంలా ఉంటుంది. రష్యా వంటకాల్లో, జపాన్‌ నూడిల్స్‌లోనూ, మద్యపానీయాల తయారీలో బార్లీకి భారీ ప్లేసే ఉంది. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని, పెరిగే పంటల్లో బార్లీ కూడా ఒకటి. రసాయనాల వాడకం ఉండదు. పొట్టుతోనూ, పొట్టు తీసినవి, పిండిగా బార్లీ వివిధ రూపాల్లో మార్కెట్‌లో లభ్యమవుతుంది. ఉడకడానికి సమయం ఎక్కువ పట్టే మాట వాస్తవమేగానీ, బార్లీలో పీచుతో పాటు పోషకవిలువలు సమృద్ధిగా ఉన్నాయి. ఔషధ గుణాలూ మెండుగా ఉన్నాయి. మరి ఈ రోజు నుండే మీ ఆహారంలో బార్లీకి స్థానం కల్పించి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved