బొడ్డు తాడుతో ఉపయోగాలేమిటో తెలుసా..?

తన బిడ్డ కలకాలం ఆరోగ్యంగా వుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. తపన పడుతుంది. భవిష్యత్తులో ఏదైనా కారణాల వల్ల ఆ బిడ్డకు అనారోగ్యం సంభవిస్తే... ఏదైనా అవయవం దెబ్బతింటే? కేవలం ఒకే ఒక్క కణంతో పాడైన తన బిడ్డ అవయవాన్ని మళ్లీ సృష్టించవచ్చని తెలిస్తే... ఏ అమ్మ అయినా ఆ కణాన్ని ఎంతో జాగ్రత్తగా దాస్తుంది. తన బిడ్డను ఎంత మురిపెంగా చూసుకుంటుందో... అంతే జాగ్రత్తగా ఆ కణాన్ని దాచుకుంటుంది. ఆ కణం మరెక్కడో లేదు... తన బిడ్డకు ఆహారాన్ని అందించే తన బొడ్డుతాడులోనే ఉంది. ఆ కణాలనే మూలకణాలు (స్టెమ్ సెల్స్) అంటారు. ఆ మూలకణాన్ని దాచి ఉంచితే చాలు... మున్ముందు బిడ్డ శరీరానికి చెందిన ఏ అవయవాన్నైనా పునరుత్పత్తి చేయడం సాధ్యపడుతుంది. ఈ బొడ్డుతాడు సేకరణ తల్లి ప్రసవ సమయంలో మాత్రమే సాధ్యపడుతుంది.

బొడ్డు తాడు (అంబిలికల్) :

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది . పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు (స్టెమ్ సెల్స్) పుష్కలంగా ఉంటాయి. వాటినే ‘హెమటోపాయినిక్ సెల్స్’ అంటారు. తెలుగులో చెప్పాలంటే ‘మూల కణాలు’. తల్లిలోని బొడ్డుతాడుతోపాటు గర్భాశయంలోని ద్రవంలో ఈ కణాలు ఉన్నప్పటికీ 98శాతం బొడ్డుతాడులోని రక్తంలోనే ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. దెబ్బతిన్న శరీర భాగాలను మూల కణాల సాయంతో బాగు చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. మూల కణాలను ఆయా శరీర భాగాల్లోకి ప్రవేశపెడితే తిరిగి అక్కడ నూతన కణాలు ఏర్పడి వ్యాధిని నయం చేస్తాయి.

ఒకసారి స్టెమ్‌ సెల్స్‌ దాచుకుంటే షుగర్‌, బిపి నుంచి క్యాన్సర్‌ వరకూ వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాల నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా, తేలికగా బయటపడవచ్చు. బట్టతల, వినికిడి సమస్యలు, షుగర్‌, హార్ట్ స్ట్రోక్‌, పెద్ద పేగుల్లో వచ్చే సమస్యలు, రక్త నాళాల సమస్యలు, జ్ఞాపక శక్తి, మెదడుకు గాయాలు వంటి ఎన్నో సమస్యలకు స్టెమ్‌ సెల్‌ ద్వారా చికిత్స అందించవచ్చు. ఒకవేళ శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే.. మూల కణాలను ఇంట్రా వీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకూ వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు తేల్చాయి.

ఎయిడ్స్, అల్జీమర్స్, డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్ వ్యాధులు, మస్క్యులర్ డిస్ట్రోఫీ, పార్కిన్ సన్స్ వ్యాధి, మెదడు, వెన్నెముక గాయాలు, స్ట్రోక్, గర్భాశయ సమస్యలకు మూల కణాలతో చికిత్స చేయగా సానుకూల ఫలితాలు వచ్చాయి. స్టెమ్ సెల్స్ మానవ శరీరంలో అన్ని రకాల టిష్యూస్, అవయవాలు, వ్యవస్థలను మళ్లీ రీజనరేట్ చేయగలవు. ఇవి 200 రకాల టిష్యూలను పునరుత్పత్తి చేయగలుగుతాయి. ఒక్కో స్టెమ్ సెల్ ఎర్ర రక్త కణంగా, నరాల కణంగా, కండరాల కణంగా విడిపోగలుగుతుంది. పునర్ నిర్మించే సత్తా, రిపేర్ చేసే గుణం, డ్యామేజ్ అయిన కణాన్ని మళ్లీ పునర్ నిర్మించే సత్తా, అనారోగ్యానికి గురైన అవయవాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే సత్తా కలిగి ఉంటాయి.. స్టెమ్ సెల్స్. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రముఖులు తమ పిల్లల మూలకణాలను భద్రపరుస్తున్నారు.

అవగాహన...

బ్యాంకులో డబ్బుదాచుకుని అవసరమైనప్పుడు తీసి వాడుకున్నట్లుగా... ఈ మూలకణాలనూ సంబంధిత బ్యాంకులో దాచుకుని భవిష్యత్తులో ఏదైనా అవయవం దెబ్బతిన్నప్పుడో లేదా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చినప్పుడో వాడుకోవచ్చు. కానీ ఇప్పటికీ దీనిగురించి సాధారణ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఇంతటి విలువైన బొడ్డుతాడును చాలామంది మునపటిలాగే పారేస్తున్నారు. బొడ్డుతాడు నుంచి సేకరించిన ఈ మూలకణాలను జాగ్రత్తగా దాచుకుంటే మున్ముందు అవయవాలు దెబ్బతిన్నప్పుడు మాత్రమే కాదు... ఒకవేళ రక్తానికి సంబంధించిన వ్యాధులు వచ్చినా లేదా ఇప్పటి వరకూ చికిత్స సాధ్యం కాదని భావిస్తూ ఉన్న జన్యుసంబంధమైన వ్యాధులు వచ్చినా ఈ మూలకణాలతో సులువుగా చికిత్స చేయవచ్చు. అందుకే మీ మొదటిబిడ్డ సమయంలో వీటిని సేకరించలేదా? ఇప్పుడు మీరు రెండో బిడ్డకు ప్లాన్ చేసుకునే దశలో ఉన్నారా? నష్టపోయిందేమీ లేదు... ఇప్పుడు మీ రెండోబిడ్డనుంచి సేకరించిన కణాలే... మీ రెండోబిడ్డతో పాటు, మొదటిబిడ్డకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని సేకరించి బ్యాంకులో దాచుకుని మీ బిడ్డలకు రక్షణ కల్పించుకోవచ్చు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved