మొలకెత్తిన గింజలతో మేలైన ఆరోగ్యం

మొలకెత్తిన గింజలు వయసుతో పరిమితం లేకుండా.. అందరికీ ఆరోగ్యకరమే. కానీ.. చాలా మంది వీటిని ఇష్టపడరు. అయితే చిన్నా పెద్దా అందరూ సాయంకాలం గుప్పెడు మొలకెత్తిన గింజలు తీసుకుంటే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో పోషకాలను దాచుకున్న మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవించేయవచ్చు. సాయంత్రం వేడి వేడి పకోడి, మిరపకాయ బజ్జీ, లొట్టలేసుకుంటూ తినే మంచూరియన్, చిప్స్, బర్గర్ వంటివి తినడానికి అందరూ ఎగబడుతూ ఉంటారు. అయితే ఇలాంటి హానికారక ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం కంటే.. మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. కానీ ఫాస్ట్ ఫుడ్స్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మొలకెత్తిన గింజలకు ఇవ్వరు. అయితే మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవడమే కాకుండా.. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చూస్తుంది. కాబట్టి వారానికి ఒకసారైనా మొలకెత్తిన గింజలను డైట్ లో చేర్చుకోవడానికి ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. అవేంటో ఒకసారి చెక్ చేస్తే.. మీరు కూడా ఈ డైట్ ఫాలో అయిపోతారు.

మొలకెత్తిన గింజల్లో విటమిన్స్, ఖనిజ లవణాలు, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శనగలు, వేరుశనగ, పెసర్లు, చిక్కుళ్లు, సోయా, అలసందలు వంటి వాటి ద్వారా పొందవచ్చు. కాబట్టి మొలకెత్తిన గింజలు తరచుగా తీసుకోవడం వల్ల యాక్టివ్ గా, హెల్తీగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొవ్వు పెరగకుండా మధ్యాహ్నం మాంసాహారం తీసుకుంటే.. ఖచ్చితంగా సాయంత్రం మొలకెత్తిన గింజలు చేర్చుకోవాలి. దీనివల్ల మాంసాహారంలోని హానికారక కొవ్వు శరీరంలో పేరుకోకుండా జాగ్రత్తపడవచ్చు. మొలకెత్తిన గింజల్లో నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే ఎక్కువగా తినాలనే కోరికను అదుపు చేస్తుంది.

జీర్ణక్రియ మనం తీసుకున్న ఆహారంలోని కార్బొహైడ్రేట్స్ చక్కెరులుగా, ప్రొటీన్స్ ఎమినో యాసిడ్స్ గా, కొవ్వు పదార్థాలు కొవ్వు ఆమ్లాలుగా విడిపోతాయి. ఇలా విడిపోవడానికి సహకరించే ఎంజైమ్స్ మొలకెత్తిన గింజల్లో ఉంటాయి. గింజలను మొలకెత్తించడం వల్ల పోషకాలు మరింత పెరుగుతాయి. కాబట్టి వీటిని డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి.

ఎసిడిటి మొలకెత్తిన గింజలు తరచుగా తీసుకోవడం వల్ల ఎసిడిటి సమస్య దరిచేరదు. అలాగే గ్యాస్ర్టిక్ ట్రబుల్ సమస్య కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే మొలకెత్తిన గింజల్లో క్యాన్సర్ నివారించే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఏదో ఒకరకం కాకుండా.. రకరకాల గింజలను మొలకెత్తించి తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved