యవంచనకు వాడిపోయిన కు'సుమ'o

మూడేళ్లు సహజీవనం చేసి మోజు తీరాక వదిలించుకున్న వంచకుడు.

తనువు చాలించిన నిర్భాగ్యురాలు.

ఒంటరిగా మిగిలిన చిన్నారి........

నిజామాబాద్: నీకు ఐదు తులాల బంగారం చేయిస్తా , నీ బిడ్డకు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తా, ఆధారం లేని నిన్ను పెళ్లి చేసుకుని ఆధరిస్తా అంటూ అభం శుభం తెలియని మహిళను మాయమాటలతో లోబర్చుకున్నాడు. మూడేళ్లపాటు సహజీవనం చేసి ఇప్పుడేమో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ నయవంచకుడు అబలను వంచించాడు. మోసపోయానని తెలుసుకున్న ఆ విధి వంచిత బలవన్మరానికి పాల్పడింది. చిన్ననాడే తండ్రికి దూరమై, చివరకు తల్లిని కూడా కోల్పోవడంతో ఆ చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది. ధర్పల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ హృదయ విషాదకర గాథ జిల్లా ప్రజలను కలిచివేసింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన సోమసుమలత(30) పదేళ్ల క్రితం జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిగింది. వీరికి కూతురు పుట్టింది. భర్త తాగుబోతు కావటంతో, విడాకులు తీసుకుని కూతురు శిరీషతో కలిసి అమ్మవారి ఇంటికి చేరుకుంది. కూలీ పనులు చేసుకుంటూ కాయకష్టం మీద బతుకు వెళ్ల దీస్తుంది. పొలం పనుల కోసం అదే గ్రామానికి చెందిన ఏనుగు సురేందర్‌రెడ్డి పొలానికి కూలీ పనులకు వెళ్లేది. అలా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేశాడు. తన భార్యకు సంతానం లేకపోవటంతో సుమలతను రెండో భార్యగా స్వీకరిస్తానని, తన కూతురు పెళ్లి ఖర్చులకు డబ్బులు డిపాజిట్ చేస్తానని కొందరు పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నాడు. అలా ఆ దుశ్శాసనుడు ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అలా వీరు గత మూడేళ్లుగా సహజీవనం సాగించాడు. తీరా మోజు తీరాక వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు. గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటూ వచ్చాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే.. నీకు నాకు సంబంధం లేదు, నీ దారి నీవు చూసుకో అని దూర్భాషలాడాడు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన ఆ నిర్భాగ్యురాలు, నయవంచనకు గురయ్యానని, తనకు చావే శరణ్యం అని భావించింది.

కూతురును పాఠశాలకు పంపించాకనే..

తండ్రి లేని లోటును తన కూతురుకు రానీయకుండా అల్లారు ముద్దుగా పెంచింది. కష్టపడి పనిచేస్తూ కూతురును చదివిస్తుంది. చివరికి వంచకుడి మోసం వల్ల తన పేగుబంధాన్ని వీడటానికి సిద్ధపడింది. శుక్రవారం ఉదయం తన కూతురు శిరీషను అందంగా ముస్తాబు చేసి పాఠశాలకు సాగనంపింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల నుంచి వచ్చిన శిరీష అమ్మ చనిపోయిన విషయం తెలియనిస్థితిలో అమ్మా అంటూ పిలుస్తూ ఏడవటం పలువురిని కలిచివేసింది. తల్లి మృతదేహాన్ని వాహనంలో తీసుకెళ్తుంటే.. అమ్మా అంటూ ఆ చిన్నారి తన తల్లి చేతిని పట్టుకుని వెంటపడుతూ ఉంటే ఆ దృశ్యం చూసిన స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved