క్యాన్సర్ ఖతం

వెల్లుల్లితో కేన్సర్ల‌కు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. మనం వంటకాల్లో తరచూ వెల్లుల్లిని వాడుతూనే ఉంటాం. ఇది ఆహార పదార్ధాలకు మంచి రుచిని తెచ్చిపెట్టడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇందులో బోలెడన్ని రసాయన పదార్థాలున్నాయి. ఇవి శరీరంలోని చెడ్డ కొవ్వు మోతాదును తగ్గించడానికి తోడ్పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అయితే వెల్లుల్లి రెబ్బలను చితగ్గొట్టి కాసేపయ్యాక పచ్చిగా తింటే మరింత ఫలితం కనపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిలోని రసాయనాలు మనకు ఎలాంటి లాభాలు కలుగజేస్తాయో చూద్దాం.

*వెల్లుల్లిలో గంధక రసాయనాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. వెల్లుల్లి ఘాటు వాసనకు కారణం ఇవే. దీనిలోని అజోయేన్‌ రక్తం గడ్డలు కట్టకుండా కాపాడుతుంది.

*అలిసిన్‌ అనేది యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌, యాంటీ ఫంగల్‌గా పని చేస్తుంది. ఇది పలు రకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుందన్నమాట. రక్తనాళాలు ముడుచుకుపోయేలా చేసే యాంజియోటెన్సిన్‌ అనే ప్రొటీన్‌ను అలిసిన్‌ అడ్డుకుంటుంది. రక్తప్రసారం సాఫీగా జరిగేలా చూస్తుంది.

*వీటిలోని పోలిసలైడ్లు శరీరంలోకి వెళ్లాక హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువుగా మారుతాయి. ఇది రక్తనాళాలను సాగేలా చేసి రక్తపోటు తగ్గడానికి తోడ్పడుతుంది.

*తరచూ జలుబు బారినపడేవారు వెల్లుల్లిని రోజూ తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

*మన శరీరం ఇనుమును గ్రహించుకునేలా చేయడంలో ఫెర్రోపోర్టిన్‌ అనే ప్రొటీన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలోని డయాలీల్‌ సల్ఫైడ్లు ఈ ఫెర్రోపోర్టిన్‌ ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇనుము సంబంధ జీవక్రియలు మరింత మెరుగ్గా సాగడానికి తోడ్పడుతుంది.

*వెల్లుల్లిలోని డయారల్‌ సల్ఫైడ్‌, ధియాక్రెమోనాన్‌లు వాపు నివారకాలుగా ఉపయోగపడతాయి. ఇక ఆలీల్‌ సల్ఫైడ్‌లు కొన్నిరకాల కేన్సర్ల నివారణకు తోడ్పడుతాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved