వయసు ఛాయలు కనపడకుండా..!!

వయసు పైబడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడటం సహజం. దీనిని నివారించడానికి చాలామంది తరచూ బ్యూటీపార్లర్‌కి వెళుతూ ఉంటారు. యాంటీ ఏజింగ్ క్రీములు రాయడం, ట్రీట్‌మెంట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా ముదిమి ఛాయలు కనపడకుండా ఎవరికి తోచిన రీతిలో వారు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మరింత యవ్వనంగా కనిపించవచ్చు. మరి నిత్య యవ్వనంగా మెరిసిపోవడానికి ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాల్సిన కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందామా...

• ఉసిరి..

ఉసిరిలో విటమిన్ 'సి' అధికంగా లభిస్తుంది. అలాగే చర్మపోషణకు అవసరమైన ఖనిజపదార్థాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దీనిలోని పోషకాలు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల చర్మానికి సరైన పోషణ అందుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది. ఉసిరిని తినడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

• సాల్మన్ చేప..

సాల్మన్ చేపలో ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలు చర్మ కణాలపై పొరలా ఏర్పడి అవి పాడవకుండా చేస్తాయి. అందుకే వారానికి రెండు సార్లు ఈ చేపను ఆహారంగా తీసుకోవాలి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది.

• ఆలివ్ ఆయిల్..

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి, అందానికి మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. దీనిలో ఉన్న పాలీఫినాల్స్, యాంటీఆక్సిడెంట్లు, మోనోశ్యాచురేటెడ్ కొవ్వుల వల్ల వయసు మీద పడుతున్న ఛాయలు దగ్గరకి రావు. అందుకే వంటల్లో ఆలివ్‌నూనెను కూడా చేర్చుకోవాలి. అలాగే అప్పుడప్పుడు ఆలివ్ నూనెతో చర్మాన్ని మర్దన చేసుకుంటూ ఉండాలి.

• డార్క్ చాక్లెట్..

సూర్యరశ్మి, అతినీల లోహిత కిరణాల ప్రభావం వల్ల కూడా చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతుంది. కొకొవా బీన్స్‌తో తయారు చేసిన డార్క్ చాక్లెట్ ఈ ప్రభావాన్ని కాస్త తగ్గిస్తుంది. దీనిలో లభించే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తాయి. అలాగే ఇది చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతుంది. ఫలితంగా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

• గింజలు..

బాదం, జీడిపప్పు, పిస్తాలాంటి గింజలను తినడం ద్వారా అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల ఆరోగ్యంగానే కాదు.. అందంగానూ తయారవ్వచ్చు. అయితే వీటిని మరీ ఎక్కువగా తినడం వల్ల లావయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మోతాదు మించకుండా జాగ్రత్త పడాలి.

• వెల్లుల్లి..

వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రక్తాన్ని శుద్ధి చేసి చెడు కొలెస్ట్రాల్‌ని బయటకు పంపిస్తాయి. ఫలితంగా ముఖం మీద వచ్చే ముడతలు తగ్గుముఖం పడతాయి. కొందరిలో బరువు తగ్గడం వల్ల చర్మం సాగినట్లుగా అవుతుంది. తిరిగి దాన్ని బిగుతుగా మార్చడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది.

• మరికొన్ని...

* రోజూ సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల రక్తం శుద్ధిపడుతుంది. అలాగే చర్మానికి కావల్సిన తేమ కూడా అందుతుంది.

* గ్రీన్ టీ తాగడం వల్ల చర్మ కణాలు పునరుత్తేజితం చెందుతాయి. దీనివల్ల కూడా ముడతలు తగ్గుతాయి.

* బీన్స్‌లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తాయి.

* నారింజ జాతి పండ్లలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే విటమిన్ 'సి' కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి వీటిని రోజూ తింటూ ఉండాలి


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved