ఖమ్మం జిల్లాలో నిరుద్యోగిఆత్మహత్య

ఉద్యోగ ప్రకటన వెలువడ్డ రోజే ఘటన

''ఏడుస్తూ పుట్టిన నేను.. ఏడుస్తూ బతకలేక చస్తున్నా'నంటూ ఆత్మహత్య చేసుకున్నాడో నిరుద్యోగ యువకుడు. ఖమ్మం జిల్లాలో బుధవారం రాత్రి జరిగిందీ విషాదం. జిల్లాలోని కొణిజర్ల మండలం చిన్నమునగాల గ్రామానికి చెందిన పాపగంటి రాధాకృష్ణ (25) ఖమ్మంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాడు. రెండు సంవత్సరాలుగా ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అతడి తల్లిదండ్రులు వెంకటరమణ, వెంకటేశ్వర్లు వ్యవసాయ కూలీలు. ఎకరం పొలం పండించుకొంటూ.. కూలి పనులు చేసుకొంటూ రాధాకృష్ణను చదివించుకున్నారు. కష్టపడి చదివిన కొడుకుకు ఎప్పటికైనా మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో వారు జీవిస్తున్నారు. రాధాకృష్ణ మాత్రం.. పెద్ద చదువు చదివినా రెండేళ్ల నుంచి ఉద్యోగం లేకపోయిందని తరచూ వాపోతుండేవాడని అతడి స్నేహితులు అంటున్నారు. కాగా బుధవారం రాత్రి రాధాకృష్ణ తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లి ఇంటిముందు వసారాలో పడుకొన్నారు. గురువారం ఉదయం వారు లేచి చూసేసరికి అతడు ఉరివేసుకొని చనిపోవడంతో షాక్‌తిన్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ టీవి చూశాడని.. ఎప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకొన్నాడోనని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆలస్యంగానైనా మంచి ఉద్యోగం సాధిస్తానని కొడుకు అంటుండేవాడని, చివరకు తమను వదిలిపోయాడని తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదించారు. అయితే.. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగ ప్రకటన వచ్చిన రోజే ప్రాణాలు తీసుకున్నాడంటే.. ఆ పోస్టుల్లో తన డిగ్రీకి సంబంధించిన పోస్టులు లేకపోవడం కూడా కారణమై ఉండొచ్చని అతడి స్నేహితులు అభిప్రాయపడుతున్నారు.

సూసైడ్‌నోట్‌లో...

తను జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, అవన్నీ విఫలమవుతూనే ఉన్నాయని రాధాకృష్ణ సూసైడ్‌నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. సమాజంపై విరక్తి కలిగినట్టు పేర్కొంటూ.. ''మనిషి బతకడానికి ఇంత కష్టపడాలా'' అని రాశాడు. 'నేను చస్తున్నా.. ఏడుస్తూ పుట్టిన నేను..ఏడుస్తూ బతకలేక చుస్తున్నా' అని రాసుకున్నాడు. తన చెల్లెలిని ఉద్దేశించి.. 'సారీ బుజ్జి' అని చివరి మాటలుగా రాశాడు.

- See more at: http://www.snehahastamsociety.org/useful-articles.php

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved