జియోను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్ ఫ్రీ ఆఫర్

రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.149ల రీఛార్జ్‌తో నెల మొత్తం అపరిమితమైన లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకునేలా ఆఫర్‌ను తీసుకొస్తోంది. నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. జియో రాకతో టెలీకాం సంస్థలు భారీగా తమ కస్టమర్లను కోల్పోతున్నాయి. దీంతో అవి కూడా ఓ మెట్టు దిగి ధరలను తగ్గించినప్పటికీ ఫలితం లేకపోయింది. డిసెంబర్ 31 వరకు ఇచ్చిన వెల్ కమ్ ఆఫర్‌ను ముకేశ్ అంబానీ వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించారు. ఈ ప్రకటనతో టెలీకాం సంస్థల్లో మరోసారి గుబులు మొదలైంది.

జియోకు చెక్ పెట్టేందుకు కస్టమ్లర సంఖ్యను పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెడుతోందని తెలుస్తోంది. జియోకు కేవలం 4జీ నెట్‌వర్క్ మాత్రమే ఉండగా, బీఎస్ఎన్ఎల్ తనకున్న 2జీ, 3జీ నెట్‌వర్క్‌లలో ఈ ఆఫర్‌ను వెల్లడిస్తే.. ఆ సంస్థకు భారీ సంఖ్యలో కొత్త కస్టమర్లు చేరే అవకాశం ఉంది. మిగతా టెలీకాం సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ వాటి ధరలు బీఎస్ఎన్ఎల్ కంటే ఎక్కువగా ఉండటం ప్రభుత్వ రంగ సంస్థకు అడ్వాంటేజ్‌గా మారనుంది.

జియో వెల్‌కమ్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ ముగిశాక.. ఆ సంస్థ కూడా వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తుంది. జియో వెల్లడించిన ప్లాన్ల ప్రకారం రూ.149 ప్లాన్‌లో ఆ సంస్థ ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తుంది. దీంతోపాటు 28 రోజుల వ్యాలిడిటీతో 300 ఎంబీ డేటా, 100 లోకల్, నేషనల్ ఎస్సెమ్మెస్‌ను కూడా అందించనుంది. కాకపోతే జియో సేవలు 4జీకే పరిమితమనే సంగతి తెలిసిందే. 2014-15లో రూ.8234 కోట్ల నష్టాలను మూటగట్టుకున్న బీఎస్ఎన్ఎల్ 2015-16లో వాటిని రూ.3879 కోట్లకు తగ్గించుకోగలిగింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved