ఎండిపోయి మెట్టైపోయిన 10 ఎకరాలు, అరవై వేలు అప్పు చేసి మూడు బోర్లు వేసినా పడని చుక్క నీరు, చేతిలో డబ్బు లేదు, నెత్తి మీద పుట్టెడు అప్పులు, వాటికి వడ్డీలు, సంపదనా మార్గాలు మృగ్యం. ఇటువంటి పరిస్థితి కారణంగానే గత 10 యేళ్ళగా వేలాది రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు. కానీ మనసుంటే మార్గముంటుందని చింతకాంపల్లి రత్నప్ప నిరూపించాడు. మెట్టలో నుంచే బంగారు జలాలను పొంగించాడు. రాష్ట్రంలోని లక్షలాది రైతులకు ఆదర్శంగా నిలచిన రత్నప్ప కథను మీరూ చదవండి.

సమస్యల రాళ్లు తనపై పడినప్పుడు పిరికివాడు పారిపోతాడు. ధైర్యవంతుడు ఎదురు నిలుస్తాడు. ఆ రాళ్లతోనే దుర్గం నిర్మించుకుంటాడు మేధావి.… ఇదిగో ఈ మూడో కోవకు చెందిన వ్యక్తే రత్నప్ప. నీటి కోసం వేసిన బోర్లు వెక్కిరించాయి. బోర్ల కోసం తెచ్చిన డబ్బు అప్పుగా మారి భారమైంది. కుంగిపోవడానికి బదులు ఆత్మస్త్థెర్యాన్ని కూడగట్టుకున్నాడు. రత్నప్ప. శాంతిపురం మండలం చింతకాంపల్లికి చెందిన ఓ నిరుపేద దళిత రైతు. పేరుకు ఎనిమిదెకరాలున్నా.. అంతా మిట్ట పల్లాలతో నిండిన మెట్టే. పొలంలో పసిడి పండించొచ్చన్న పెద్దల మాట వినడమే తప్ప ఏనాడూ చేసింది.. చూసింది లేదు. నిత్యం అదే దిగులు. నీటి చుక్క లేక నోరు వెళ్లబెట్టిన నేలతల్లి దాహార్తిని తీర్చడానికి నడుం కట్టాడు. కూలి చేసి కూడబెట్టిన సొమ్ముతో ధైర్యం చేసి వరుసగా మూడు బోర్లు వేశాడు. నీరు పడలేదు సరికదా.. అరవై వేల అప్పు మిగిలింది. మళ్లీ నిరాశే. నీటి కుంటలతోనే భూగర్భ జలాలు పెంచొచ్చని విన్నాడు. అంతే అక్షరాలా ఆచరించాడు. ఉపాధి ఆసరాగా తనకున్న ఎనిమిదెకరాల పట్టా భూమిలో సగానికి పైగా నీటి కుంటను (క్యాచ్‌మెంటు ఏరియాతో కలిపి) నిర్మించాడు. రూ.2.8 లక్షల వ్యయంతో చక్కని ఊటకుంట తయారైంది. ఇన్నాళ్లూ వానచుక్క పడుతూనే జలజలా పారిపోయేది. ఇక ఇప్పుడు కుదరదు. వాననీటిని ఒడిసి పట్టగలనన్న నమ్మకం రత్నప్ప కళ్లల్లో కదలాడుతోంది. నిన్నటిదాకా భారంగా మారిన బతుకు చిత్రం.. ఇపుడు గుండెనిండా కొండంత విశ్వాసం. సొంత భూమిని సామాజిక అవసరాల కోసం త్యాగం చేసిన రత్నప్ప తాను ఎలా లాభపడనున్నాడో ఆయన మాటల్లోనే.. నాకున్న భూమంతా ఏళ్లుగా నీరు లేక వృథాగానే ఉంది. ఒక బావి, రెండు బోర్లేసినా నిరాశే మిగిలింది. ఇపుడు నిర్మించిన ఊటకుంటలో నీరు నిండితే దిగువన ఉన్న నా మిగిలిన భూమిలోని బోర్లు, బావి రీఛార్జి అవుతాయి. ఇక నాకు సాగునీటి దిగులుండదు. సమీపంలోని పొలాల్లోని బోర్లు కూడా రీఛార్జి అవుతాయి. పక్కనున్న నాతోటి రైతులకూ మేలే. దీన్లో మామిడి తోట నాటుతా. మొక్కలు, నాటుకోవడానికి, రక్షణ, బోరుకు బిందు సేద్య పరికరాలు అన్నీ రాయితీతో పొందుతా. కోల్పోతున్న క్యాచ్‌మెంటు ఏరియాలోని నాలుగున్నర ఎకరాల్లోనూ బిందు సేద్యంతో మామిడి నాటుతా.* నేను నా కోసం నా పొలంలోనే పనిచేసినా.. గత ఎనిమిది నెలల్లో ఈ కుంట తీయడం ద్వారా కూలీ రూపంలో నా కుటుంబానికి రూ.56 వేల ఆదాయం వచ్చింది. అందుకే ఇపుడు మనసంతా ఆనందం.

దీన్ని మెచ్చుకునే మొదటివారు మీరే అవ్వండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved