నెలకు 100 రూ. లు కడితే ఏడాదికి 2 లక్షల భీమా

అందరికీ ఆరోగ్యం, భరోసా కల్పించే కొత్త పథకానికి నూతన సంవత్సరంలో శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికీ ఆరోగ్య బీమా అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యరక్ష పథకాన్ని రూపొందించామని, జనవరి ఒకటోతేదీ నుంచి రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని వెల్లడించారు. ఆయన నేతృత్వంలో శనివారం సమావేశమయిన మంత్రివర్గం ఈ స్కీంకి ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం పేదవర్గాలకు తెల్లరేషన్‌ కార్డు ఆధారంగా ఎన్టీఆర్‌ ఆరోగ్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఇక.. జర్నలిస్టులు, ఉద్యోగులకు నామమాత్రపు ప్రీమియంతో ప్రభుత్వం.. ఆరోగ్య రక్షణ కల్పిస్తోంది. ఇక ఏ ఆరోగ్య పథకంలో చేరని, ఎలాంటి ప్రభుత్వ రక్షణ అందని వారు ఏతావాతా 17 లక్షల మంది ఉంటారని అంచనా. వారికి తక్కువ ప్రీమియంతో ఆరోగ్యకవచం అందించాలని తాజాగా కేబినెట్‌ నిర్ణయించింది.

పేదలు, జర్నలిస్టు, ఉద్యోగ కేటగిరీలోకి రాని వర్గాలకు చెందిన కుటుంబాల్లోని ప్రతి సభ్యుడు నెలకు రూ.100 ప్రీమియం చెల్లించి.. పథకంలో సభ్యుడు రావచ్చు. వీరిలో ప్రతి ఒక్కరూ ఏడాదికి రూ.రెండు లక్షల మేర బీమా సౌకర్యం వీరు పొందుతారు. వృద్ధుల నుంచి ప్రైవేటు బీమా సంస్థలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తున్నాయి. అలాచూసినప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న పథకం పండుటాకులకు ఊరటనేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పథకం అమలు ఊపందుకొన్నకొద్దీ ఈ ప్రీమియం మొత్తాన్ని తగ్గించుకుంటూ రావాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందని, మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved