రాజేష్, రమేష్ లిద్దరూ సినిమాకు వెళ్ళాలని కబుర్లు చెప్పుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు.

అలా వారు వెళుతుండగా, ఒక అంధుడు ఇవతలి వైపు నుండి అవతలి వైపుకు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడటాన్ని వారు చూసారు.

" ఒక్క నిమిషం నువ్విక్కడే వెయిట్ చేయి రమేష్ " అని చెప్పి, రాజేష్ ఆ అంధుడి దగ్గరకు వెళ్ళి , " అన్నయ్యా...! నేను నిన్ను రోడ్డు దాటిస్తాను, నా చేతిని పట్టుకో....." అంటూ అతడిని రోడ్డు దాటించి తిరిగి రమేష్ దగ్గరకు వచ్చాడు.

అప్పుడు రమేష్ , రాజేష్ తో " మనకు సినిమాకు టైమవుతోందని తెలుసు కదా....! ఇలా ఊళ్ళో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి నువ్వెళుతుంటే, ఇక మనం సినిమాకు వెళ్ళినట్లే......" అంటూ నసుగుతూ ముందుకు కదిలాడు.

వారు మరి కొంత దూరం నడిచిన తర్వాత , రోడ్డు డివైడర్ కు అవతలి వైపున జనమంతా చుట్టూ గుమికూడి ఉన్నారు.

అది చూసిన రాజేష్, " అక్కడేదో యాక్సిడెంట్ జరిగినట్లుంది, ఒక్కసారి అక్కడికెళ్ళి చూద్దాం పద...." అని రమేష్ తో అన్నాడు.

" అక్కడికేమీ వద్దు...., ముందు మనం సినిమాకు వెళదాం పద...., అయినా ఊర్లో ఎవరు బ్రతికితే ఏమిటి....? ఎవరు చస్తే ఏమిటి...? మనకు సినిమాకు టైమవుతోందని...." అంటూ రాజేష్ చేయిపట్టి రమ్మని లాగాడు రమేష్.

రమేష్ చేతిని పక్కకు తోస్తూ, " ఐదు నిమిషాలు సినిమాకు ఆలస్యమయితే ఏమీకాదు....., నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తానంటూ....." రోడ్డు దాటి అవతలి వైపుకు పరిగెత్తుకు వెళ్ళాడు రాజేష్.

అక్కడికెళ్ళి చూసిన రాజేష్, " ఒరేయ్....! రమేష్ , మీ నాన్నకే యాక్సిడెంట్ అయిందిరా...., త్వరగా రారా.... అంటూ గట్టిగా కేకలు వేసాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న తన నాన్నను చూసి విలవిలలాడిపోయాడు రమేష్.

అంబులెన్సు కు ఫోన్ చేసి, మరికొందరి సాయంతో ఆస్పత్రిలో చేర్చారు. ఒక అర గంట ఆలస్యం అయి ఉంటే, ప్రాణాలు దక్కేవి కాదని డాక్టర్లు చెప్పారు.

అంతవరకు విపరీతమైన బాధను, టెన్సన్ ను అనుభవించిన రమేష్, ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని, రాజేష్ చేతులు పట్టుకొని కన్నీరు పెట్టుకుంటూ," ఎదుటివారు ఎవరైనా గానీ, మనకు అవకాశం ఉన్నప్పుడు, తోచిన విధంగా సాయపడాలనే నీ మంచి గుణమే ఈరోజు మా నాన్న ప్రాణాలను దక్కించింది. అలా కాకుండా నువ్వు నా మాట విని, సినిమాకు టైమవుతోందని ఆ జనం దగ్గరకు వెళ్ళకుండా ఉండి ఉంటే మా నాన్న దక్కేవాడు కాదు " అంటూ భోరున విలపించాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved