ఎక్కడ తాగారో తెలిసిపోద్ది! ఆధార్‌ నెంబర్‌తోనే బార్‌ బిల్లు.. రసీదులో పూర్తి సమాచారం

మద్యం తాగి వాహనం నడిపేవారు ఇకపై వెళ్లేది జైలుకే. తాగుబోతుల బీభత్సాన్ని కట్టడి చేయడానికి పోలీసులు టెక్నాలజీని వినియోగించుకోనున్నారు. పేరు చెబితే చాలు.. చలాన్‌లో పూర్తి సమాచారం వచ్చేలా, ఆధార్‌తో అనుసంధానం అయ్యేలా టెక్నాలజీని రూపొందించనున్నారు. దీంతో ఎక్కడ తాగారో, ఎంత తాగారో కూడా లెక్కలతో తెలిసిపోతుంది. తాగినవారితోపాటు మద్యం షాపుపైనా వేటు పడుతుంది. కాగా మద్యం తాగి వాహనం నడిపేవారి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేక టెక్నాలజీని వినియోగించనున్నారు. బార్‌ యాజమాన్యం ఇచ్చే బిల్లులో ఆధార్‌ నంబర్‌ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తమ వద్ద ఉన్న మెషిన్‌లో సదరు వ్యక్తి పేరు, ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే అతని పూర్తి సమాచారం వస్తుంది. ఇందుకోసం చలాన్‌ షీట్‌లో ఒక ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు బార్‌లో ప్రవేశించాలంటే ఆధార్‌ను చూపించేలా నిబంధనలు విధించనున్నారు. దీంతో ఆధార్‌ నంబర్‌ నమోదు చేయగానే ఏ బార్‌లో తాగారో తెలిసిపోతుంది. ఇక తాగి రోడ్లపైకి వచ్చేవారి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకు కొన్ని కొత్త నియమాలనూ ప్రవేశ పెట్టబోతున్నారు. కాలేజీ విద్యార్థి మద్యం తాగి వాహనం నడిపితే.. అతడిపై సస్పెన్షన్‌కు కాలేజీ యాజమాన్యానికి లేఖ రాయనున్నారు. ఉద్యోగి అయితే వారి సంస్థ యాజమాన్యానికి రిపోర్టు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడితే సస్పెన్షన్‌కు సిఫారసు చేయనున్నారు. వారిని జైలుకు పంపించడమే కాకుండా శిక్షలను మరింత కఠినంగా మార్చడానికి న్యాయమూర్తులతో సంప్రదిస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో మైనర్‌ పట్టుబడితే సంబంధిత బార్‌ యాజమాన్యంపైనా కేసు నమోదుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రేమతో ఇస్తే తల్లిదండ్రులు జైలుకే..

పిల్లలు మారాం చేస్తున్నారని కొంతమంది, చదువులో ఫస్ట్‌ వచ్చారని మరికొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులను గిఫ్టులుగా ఇస్తున్నారు. కారణాలేవైౖనా పిల్లలు వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మోటార్‌ వెహికల్‌ చట్టం ప్రకారం శిక్షలు విధించనున్నారు.. రోజూ వందల్లో పట్టుబడుతున్న మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మైనర్లు తాగి వాహనం నడిపితే తల్లిదండ్రులను సెక్షన్‌ 180, 181 ప్రకారం కూడా జైలుకు పంపిస్తారు


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved