సంజీవ‌ని మొక్క నిజంగానే ఉందా..? దాంతో చ‌నిపోయిన వ్య‌క్తుల‌ను బ‌తికించ‌వ‌చ్చా..? వ‌న‌ప‌ర్తి గుట్ట‌ల్లో దొరికింది ఆ మొక్కేనా..?

రామాయ‌ణం తెలుసుగా..! అందులో రావ‌ణుడితో యుద్ధం జ‌రిగేట‌ప్పుడు ఒకానొక స‌మ‌యంలో ల‌క్ష్మ‌ణుడు శ‌త్రువుల దాడికి మూర్ఛ‌పోతాడు. అప్పుడు హ‌నుమంతుడు వెళ్లి సంజీవ‌ని తెచ్చి తిరిగి ల‌క్ష్మ‌ణుడు బ‌తికేలా చేస్తాడు. అవును, అదే సంఘ‌ట‌న‌. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ఆ సంఘ‌ట‌న‌లోని ఓ అంశం గురించే. అదేనండీ, సంజీవ‌ని మొక్క‌..! ఆ… అదే! ఆ మొక్క‌నే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా వ‌న‌ప‌ర్తి మండ‌లం తిరుమ‌ల‌య్య గుట్ట‌పై అక్క‌డి డిగ్రీ క‌ళాశాల‌కు చెందిన వృక్ష‌శాస్త్ర అధ్యాప‌కుడు స‌దాశివ‌య్య ఇటీవ‌ల గుర్తించాడ‌ట‌. ఇప్పుడు ఆ మొక్క గురించిన విష‌యం మ‌రోసారి చర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అయితే నిజంగా సంజీవ‌ని మొక్క చ‌నిపోయిన మ‌నుషుల్ని బ‌తికించ‌గ‌ల‌దా? ఆ మొక్క‌కు అంత‌టి శ‌క్తి ఉందా? చూద్దాం ప‌దండి…

ఎత్త‌యిన ప‌ర్వ‌తాల‌పై మాత్ర‌మే పెరిగే సంజీవ‌ని మొక్క శాస్త్రీయ నామం సెల‌గినెల్లా బ్రైయాప్టెరిస్‌. తెలంగాణలో ఈ మొక్క‌ను పిట్ట‌కాలుగా పిలుస్తార‌ట‌. ఇది రాళ్ల‌పైన మొలుస్తుంది. 6, 7 నెల‌ల పాటు నీరు లేకున్నా ఈ మొక్క బ‌తికేయ‌గ‌ల‌దు. అయితే ఈ మొక్క‌కు ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసే శ‌క్తి ఉంద‌ని ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది. తీవ్ర‌మైన గాయాల‌కు, వ‌డ‌దెబ్బ‌కు, దెబ్బ తిన్న క‌ణ‌జాలాన్ని మ‌ళ్లీ బాగు చేసేందుకు, జీవ‌క్రియ‌ల‌ను స‌క్ర‌మంగా న‌డిపించేందుకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్య‌క్తిని మ‌ళ్లీ మామూలు స్థితికి ర‌ప్పించేందుకు, ఆస్త‌మా, శ్వాస‌కోశ వ్యాధులు, జ్వ‌రం, వాంతులు, ర‌క్త సంబంధ వ్యాధుల‌ను న‌యం చేసేందుకు ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని శాస్త్రవేత్త‌లు గుర్తించారు. న‌ల్ల‌మల అడ‌వుల్లో నివ‌సించే చెంచు తెగ‌కు చెందిన ప్ర‌జ‌లు నీర‌సాన్ని పోగొట్టుకోవ‌డానికి, బ‌లాన్ని తెచ్చుకునేందుకు ఈ మొక్క ఆకుల ర‌సంతో చేసిన ఓ ద్ర‌వాన్ని నిత్యం తాగుతార‌ట‌. మ‌ర‌ణించ‌బోతున్న లేదా మ‌ర‌ణించిన వ్య‌క్తుల్లో ఉండే ఓ ర‌క‌మైన వైర‌స్‌ను నాశ‌నం చేసేందుకు అవ‌స‌ర‌మైన ప‌లు హార్మోన్ల‌ను సంజీవ‌ని మొక్క స్ర‌విస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారు ఈ మొక్క ద్వారా బ‌తికేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. 2009లో యోగా గురువు బాబా రామ్‌దేవ్ స‌న్నిహితుడు బాల‌కృష్ణ‌ మ‌రికొంద‌రు ఆయుర్వేద వైద్యుల‌ను వెంట బెట్టుకుని ఉత్త‌రాఖండ్ రాష్ట్రం చ‌మోలీ జిల్లాలో ఉన్న ద్రోణ‌గిరి ప‌ర్వ‌తాల‌పై సంజీవ‌ని మొక్క కోసం అన్వేషించార‌ట‌. పురాణాల్లో హ‌నుమంతుడు ఈ ప‌ర్వ‌తాన్నే తీసుకెళ్లిన‌ట్టు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. కాగా ఆ ప‌ర్వ‌తంపై వెతికిన బాల‌కృష్ణ అత‌ని బృంద స‌భ్యుల‌కు సంజీవ‌ని దొర‌క‌లేదు కానీ దాని వ‌ర్గానికే చెందిన మ‌రో 2 మొక్క‌లు దొరికాయ‌ట‌. ఈ మొక్క‌ల‌తోపాటు మ‌న దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన సంజీవ‌ని లాంటి ల‌క్ష‌ణాలు క‌లిగిన మ‌రో 17 మొక్క‌ల‌పై బెంగుళూరు వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం, ఉత్త‌ర కర్ణాట‌క‌లోని సిర్సి అట‌వీ క‌ళాశాల ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న‌లు చేశార‌ట‌. ఈ క్ర‌మంలో వారికి ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు తెలిశాయ‌ట‌. ఆ మొక్క‌ల‌న్నింటికీ దాదాపు సంజీవ‌ని మొక్క‌కు ఉన్న ల‌క్ష‌ణాలే ఉన్నాయ‌ట‌. కానీ ఈ మొక్క‌ల‌కు ఉన్న ఔష‌ధ గుణాల వ‌ల్ల‌ వ్య‌క్తుల‌ను బ‌తికించ‌డం మాట ఏమో గానీ పైన చెప్పిన ఇత‌ర అనారోగ్యాల‌ను మాత్రం త‌గ్గించ‌వ‌చ్చ‌ట‌.

తాజాగా వృక్ష‌శాస్త్ర అధ్యాప‌కుడు స‌దాశివ‌య్య అలాంటి సంజీవ‌ని మొక్క‌ల‌ను గుర్తించే స‌రికి ఇప్పుడు ఆ మొక్క‌కు సంబంధించిన అంశం మ‌ళ్లీ తెర పైకి వ‌చ్చింది. త‌మ ప‌రిశోధ‌న‌ల‌కు మ‌రిన్ని నిధులు స‌మ‌కూరిస్తే సంజీవ‌ని మొక్క‌ల‌ను ఎక్క‌డ ఉన్నా క‌చ్చితంగా గుర్తిస్తామ‌ని స‌దాశివ‌య్య చెబుతుండ‌గా, పైన చెప్పిన ద్రోణ‌గిరి ప‌ర్వ‌తాల‌ను సంజీవ‌ని మొక్క కోసం జ‌ల్లెడ ప‌ట్టేందుకు త‌మ‌కు రూ.150 కోట్లు ఇవ్వాల‌ని ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆ ప‌ర్వ‌త శ్రేణుల‌లో సంజీవ‌ని మొక్క కోసం ఎన్నో ఏళ్లుగా అన్వేష‌ణ సాగిస్తోంది. మ‌రి అంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించి ఆ మొక్క ఎలాగైనా దొరుకుతుందో, లేదో వేచి చూడాల్సి ఉంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved