అమెరికన్లను వణికిస్తున్న భారతీయ మహిళ

గత ఏప్రిల్ 4న భారత్‌నుంచి చికాగో వచ్చిన ఆ మహిళ ఇల్లినాయిస్, టెన్నిస్సీ, మిస్సౌరీ రాష్ట్రాల్లోని తన బంధువులను కలుసుకోవడం కోసం కారులో ప్రయాణించింది. ప్రస్తుతం ఆ మహిళ మేరీలాండ్‌లోని బెతెస్డాలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) వైద్య కేంద్రంలో చికిత్స పొందుతోంది. ఆమె మామూలుగా క్షయ వ్యాధి చికిత్సకు ఉపయోగించే మందులకు లొంగని 'ఎక్స్‌డిఆర్-టిబి' అనే అత్యంత అరుదైన క్షయవ్యాధితో బాధపడుతోందని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక తెలిపింది. వివరాలు తెలియని ఆ మహిళ ఆస్పత్రిలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడే రోగులకోసం నిర్దేశించిన ప్రత్యేక గదిలో ఉన్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) వర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సిడిసి బుధవారం తెలిపింది. ఈ మహిళతో దీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వారెవరనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇల్లినాయిస్‌లోని సిడిసితో కలిసి ప్రయత్నిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.అయితే సామాన్య ప్రజలకు ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం చాలా తక్కువగా ఉందని ఆరోగ్య అధికారులు అంటున్నారు. ఫ్లూ, ఆటలమ్మలాగా క్షయ వ్యాధి అంతత్వరగా వ్యాపించే అంటువ్యాధి కాదని, అయితే దీర్ఘకాలం రోగితో సన్నిహితంగా ఉండేవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ఇక విమానంలో మహిళతో పాటుగా ప్రయాణించే వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు చాలా తక్కువ అని, అయితే పూర్తిగా లేవని చెప్పలేమని కూడా వారంటున్నారు. భారత్‌నుంచి మహిళతోపాటుగా విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను సేకరించి, వారిని ఈ విషయంపై అప్రమత్తం చేస్తామని సిడిసి తెలిపింది. 2013లో ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మందికి క్షయవ్యాధి సోకగా, వారిలో 15 లక్షల మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి సోకిన వారిలో దాదాపు నాలుగోవంతు భారత దేశానికి చెందినవారేనని ప్రపంచా ఆరోగ్య సంస్థ అంటోంది. ప్రపంచంలో అత్యధికంగా క్షయ రోగులు మన దేశంలోనే ఉన్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved