పొగతాగే కనీస వయోపరిమితి పెంచిన అమెరికా

పొగరాయుళ్లకు ఇది నిజంగా చేదువార్తే. అమెరికాలోని హవాయిలో ఇకనుంచి ఎవరు పడితే వారు దమ్ము కొట్టడం కుదరదు. పొగతాగడానికి కనీస వయసును 21 ఏళ్లు చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. 21 సంవత్సరాల లోపు వాళ్లు పొగాకు ఉత్పత్తులను కొనడంపై నిషేధం విధించింది. అలాగే ఆ వయసులోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడం కూడా నేరమని పేర్కొంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి శిక్షలు తప్పవంటూ హెచ్చరించింది. కొత్త చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హవాయి ప్రభుత్వం మూడు నెలల పాటు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సరికొత్త చట్టానికి గవర్నర్ డేవిడ్ ఎల్గే గతేడాది జూన్లోనే ఆమోద ముద్రవేశారు. ఈ చట్టం ప్రకారం 21 ఏళ్ల లోపు యువతీయువకులు పొగతాగుతూ పట్టుబడితే మొదటి తప్పు కింద 10 డాలర్ల జరిమానా విధిస్తారు. ఆ తర్వాత ఎప్పుడు పట్టుబడినా 50 డాలర్ల జరిమానా విధిస్తారు. ఇక 21ఏళ్ల లోపు యువతకు పొగాకు ఉత్పత్తులు విక్రయించే వ్యాపారులకు 500 నుంచి 2వేల డాలర్ల వరకు జరిమానా విధిస్తారు.ఎలక్ట్రానిక్ సిగరెట్లపై మోజు పెంచుకుంటున్న యువత ఇటీవల బాగా పెరిగినట్టు హవాయి యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. జాతీయ సగటులో వీరు దాదాపు మూడొంతులున్నట్టు గుర్తించారు. దీనిని నివారించేందుకు నడుం బిగించిన ప్రభుత్వం పొగతాగేందుకు కనీస వయసును 21గా చేస్తూ చట్టం చేసింది. ఇప్పటి వరకు ఇటువంటి చట్టం న్యూయార్క్లో అమలులో ఉంది. ప్రస్తుతం కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved