అరటిపండు ఆరోగ్య లక్షణాలు

మనకు అతి చవకగా, అందుబాటులో ఉండే ఫల – ఆహారం అరటి పండు. ఇది రుచి వల్ల అందరికీ నచ్చుతుంది. అందరూ తింటుంటారు. ఇది మెదడుకు సంతృప్తినిస్తుంది. అరటి పండు తినడం వల్ల కఫం పెరుగుతుందని, చర్మ వ్యాధులు పెరుగుతాయని, గర్భిణులకు మంచిది కాదని అంటుంటారు. నిజానికి దోరగా పండిన అరటి పండును పగలు తీసుకోవడం మంచిదని ఆయుర్వేదంలో చెప్పారు. భోజనం తర్వాత వెంటనే తీసుకుంటే బరువు పెరగడం, శరీరంలో కఫం పెరగడానికి అవకాశం ఉంటుంది. అరటి పండులో విటమిన్ ఎ, బి పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి, ఇది రోగనిరోధకంగా పనిచేస్తుంది. ఇది అరగడానికి రెండున్నర గంటలు పడుతుంది. ప్రతి వంద గ్రాముల పండు నుంచి 100 క్యాలరీల శక్తి లభిస్తుంది. కొవ్వు చాలా తక్కువ. తేమ, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

*త్వరగా అరిగి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఒక్క అరటి పండు ద్వారా మూడు ఆపిల్ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్లు తిన్నంత శక్తి లభిస్తుంది. 150 గ్రాముల మటన్, 400 గ్రాముల పాలు తీసుకున్నప్పుడు అందినంత విటమిన్ ఎ లభ్యం అవుతుంది.

* దీనిని చంటి పిల్లలకు పాలు, తేనెతో పాటు ఇస్తుంటే బరువు పెరుగుతారు. ఆటలు ఆడే వారు, వ్యాయామాలు చేసే వారు దీన్ని తీసుకుంటే త్వరగా నీరస పడకుండా ఉంటారు. గర్భిణీ స్త్రీలకు తరచుగా వాంతులవుతూ, ఆకలిగా ఉన్నప్పుడు అరటి పండు ఇవ్వడం వల్ల శక్తితోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా అందుతుంది.

*పాలతోపాటు అరటి పండు రాత్రి పూట తీసుకుంటే నిద్ర సరిగా పడుతుంది.

* 25 గ్రాముల అతి మధురం అరటిగుజ్జుతో తీసుకుంటే నోటి పూత తగ్గుతుంది.

*జలుబు, దగ్గు ఉన్నప్పుడు 10 గ్రాముల అరటి పండును 2,3 చిటికెల మిరియాల పొడి కలిపి గోరువెచ్చటి పాలు తాగితే దగ్గు తగ్గుతుంది. అయితే, బాగా పండిన అరటిపండు తీసుకోకూడదు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved