ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా?.. హుషారుగా ఉండండి!

సమాజం పాడైపోయింది. ఎవరికీ బాధ్యత అనేదే లేదు అనే మాటలు తరచు వింటుంటాం. అలాగే మోసాలు కూడా ఎక్కువయ్యాయి. హుషారుగా లేకపోతే అంతే సంగతులు. అలాంటి సంఘటనే వెంకటేశ్‌కి కూడా ఎదురైంది. కానీ అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి నష్టం జరగకుండా బయటపడ్డాడు. అసలు విషయం ఏంటంటే, వెంకటేశ్ బెంగళూరు నివాసి. ఒకరోజు తన కారులో పెట్రోలు కొట్టిద్దామని బంక్‌కు వెళ్ళి ఫుల్‌ ట్యాంక్‌ కొట్టమన్నాడు. కార్డ్‌ తీద్దామని చూపు మరల్చాడు అంతే, కుర్రాడు డిస్పెన్సర్‌ను ఆపేశాడు. రీడింగ్‌ 300 చూపిస్తోంది. వెంకీకి ఏం అర్ధం కాలేదు. ఫుల్‌ ట్యాంక్‌ కొట్టమంటే ఎందుకు ఆపేశావు అని అడిగితే నో రెస్పాన్స్. అతను అడుగుతున్నా పట్టించుకోకుండా మళ్ళీ ట్యాంక్‌ను నింపటం మొదలెట్టాడు డిస్పెన్సర్‌ను జీరోకు సెట్‌ చేయకుండా!

సరే, ఏం చేస్తాడో చూద్దామని సెట్టింగ్స్‌ను చూస్తున్నాడు. ఇంతలో బంకులో పనిచేసే ఇంకో కుర్రాడు వచ్చి వెంకటేశ్‌ని మాటల్లోకి దించాలని ప్రయత్నిస్తున్నాడు. టైర్లలో గాలి చూడాలంటాడు. కానీ వెంకీ అవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే అతడికి తెలుసు వాళ్ళ ట్రిక్స్‌ ఏమిటో!

ఇక బిల్లు విషయానికి వస్తే 2,300 రూపాయలు చార్జ్‌ చేశాడు. పెట్రోలు కొట్టింది 48.25 లీటర్లు. కానీ కారు ట్యాంక్‌ కెపాసిటీ 42 లీటర్లు. అయితే 48 లీటర్లు ఎలా కొట్టాడు? అదే అడిగాడు వెంకీ ఆ బంకు కుర్రాడిని. వాడు అదంతే అంటున్నాడు కానీ సరైన సమాధానం ఇవ్వట్లేదు. కొంచెం గొంతు పెంచాడు వెంకటేశ. గట్టిగా అడిగేసరికి మేనేజర్‌ వచ్చాడు. అసలు బిల్లు ఇవ్వమని గట్టిగా మేనేజర్‌ను అడిగాడు వెంకటేశ. దాంట్లో 41.97 లీటర్లకు 2వేలు బిల్లు ఉంది. దొంగ దొరికిపోయాడు. వెంకీకి 300 తిరిగి ఇచ్చాడు మేనేజరు.

ఆ పెట్రోలు బంకు మెయిన్ రోడ్డు మీద ఉందేమో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 20 మంది కస్టమర్లని మోసం చేస్తే, ఆ కుర్రాడి నెల సంపాదన ఎంత ఉంటుందో ఒక్కసారి ఊహించు కోండి! ఇలాంటి మోసపూరిత సంఘటనలు ఎన్నో! వినియోగ దారుల అప్రమత్తత గురించి ఒక హెచ్చరిక లాంటిదే ఈ సంఘటన. ఎప్పుడూ తమ కొచ్చే బిల్లులను చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఏదో కొద్ది అమౌంటే కదా అని చూసీ చూడనట్లు వదిలేస్తే అదొక వైరస్‌లా పాకుతుంది. కాబట్టి వినియోగదారులూ జాగ్రత్త! అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు బిల్లులు చెక్‌ చేసుకుంటూ ఉండండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved