వండుకునే తీరిక లేక పుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త

పుడ్ డెలివరీ చేయమన్న పాపానికి ఆమె బెంగళూరు వదిలి వెళ్లాల్సొస్తుందని కలలోనైనా ఊహించుండదు. వండుకునే సమయం లేక పుడ్ ఆర్డర్ చేస్తే, వచ్చిన ఆ డెలివరీ బాయ్ ఆమెను వెంటాడడం మొదలుపెట్టాడు. కిందటేడాది అక్టోబర్ నెలలో జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అసలేం జరిగిందంటే...

ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసముండే గీత ఒకరోజు ఎందుకో వంట వండుకోవడానికి బద్ధకించి, ఒక రెస్టారెంట్‌కు కాల్ చేసి పుడ్ ఆర్డరిచ్చింది. తన అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పింది. ఇక అక్కడ నుంచి ఆమెకు మనశ్శాంతి దూరమైంది. పుడ్ డెలివరీ చేసిన కొద్దిసేపటికీ డెలివరీ బాయ్ వచ్చి గీత డోర్ కాలింగ్ బెల్ కొట్టాడు. గీత తలుపు తీసి పుడ్ తీసుకుని బిల్లు పే చేసింది. డెలివరీ బాయ్ ఆమెను మంచి నీళ్లు కావాలని అడిగాడు. సహజంగా ఎవరైనా మంచినీళ్లగితే తెచ్చివడం సహజం. అలాగనుకునే గీత నీళ్లిచ్చింది. ఆ రోజు నుంచి డెలివరీ బాయ్ ఆమెకు ఫోన్ చేసి మానసికంగా చిత్రవధ చేశాడు. అతని టార్చర్ తట్టుకోలేక నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అయినా అతడు ఊరుకోలేదు. ఇతర నంబర్ల నుంచి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు.

వచ్చిన ప్రతి నంబర్‌ను బ్లాక్ చేస్తే వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి హింసించే వాడు. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పక్కన కొందరు నవ్వుతూ, అసభ్యకర కామెంట్లు చేసేవారు. అర్థరాత్రులు కాల్ చేసి అసహ్యంగా మాట్లాడేవారు. ఒకరోజు ఫ్రెంఢ్‌తో కలిసి గీత ఇంట్లో ఉండగా ఆ డెలివరీ బాయ్ ఇంటికి కూడా వచ్చాడు. తనను ప్రేమించాలని, ఫోన్ చేయడం మాత్రం ఆపనని చెప్పాడు. దీంతో భయపడిన ఆమె పోలీసులకు ఫిర్యాడు చేసింది. కానీ పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు. అతడి దెబ్బకు భయపడి గీత బెంగళూరు విడిచి వెళ్లిపోయింది. కొన్ని నెలల నుంచి ఎలాంటి ఫోన్ లేదు. ఇంతటితో అతడి పీడ విరగడైందనుకున్న గీతకు ఈ బుధవారం రాత్రి 2.25 కు ఫోనొచ్చింది. ఫోన్ చేసింది మళ్లీ అతనే. పీఎస్‌లో తన గోడు వినరని అర్థమైన గీత ట్విట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై స్పందించిన పోలీసులు ఆమెను కలిసి వివరాలు సేకరించారు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved