మొబైల్ చెల్లింపులతో జాగ్రత్త

స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన అనేక అప్లికేషన్ల ద్వారా చెల్లింపులు చేసే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతోంది. అయితే మొబైల్‌ చెల్లింపులు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. మరి మొబైల్‌ చెల్లింపులకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

*బ్రాండెడ్‌ యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌

మొబైల్‌ చెల్లింపులు చేసే వారు బ్రాండెడ్‌ కంపెనీ యాంటీ వైరస్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఎన్నో రకాల యాంటీ వైరస్‌లకు సంబంధించి అడ్వర్‌టైజ్‌మెంట్లు మొబైల్‌లో ప్రత్యక్షం అవుతుంటాయి. వాటిని ఇన్‌స్టాల్‌ చేస్తే కీలకమైన సమాచారం చోరీకి గురి కావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధీకృత యాప్‌ స్టోర్‌లోంచి ఎక్కువ పాపులర్‌ అయిన యాంటీ వైరస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది.

*మొబైల్‌లో కీలక సమాచారం దాచొద్దు

క్రెడిట్‌/డెబిట్‌ కార్డు వెనకాల ఎవరైనా పిన్‌ నెంబర్‌ రాస్తారా? రాయరు కాదా. అలాంటప్పుడు మొబైల్‌ ఫోన్‌లో లాగిన్‌ ఐడి, పాస్‌వర్డ్‌, మొబైల్‌ పిన్‌ వంటి సమాచారం ఎందుకు స్టోర్‌ చేయాలి? ఫోన్‌ వేరే వారి చేతిలోకి వెళ్లినపుడు కీలక సమాచారం వారి చేతిలో పెట్టినట్టే అవుతుంది కదా. ఒకవేళ మొబైల్‌ ఫోన్‌ పోతే బ్యాంకు ఖాతాకు సంబంధించిన సర్వ వివరాలు పోయినట్టే. అప్పుడు నష్టం ఏ స్థాయిలోనైనా ఉండవచ్చు.

సులభ పాస్‌వర్డ్‌ వద్దు : చాలా మంది పాస్‌వర్డ్‌ను తక్కువ అంకెలు లేదా అక్షరాలకే పరిమితం చేస్తారు. కానీ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించే పాస్‌వర్డ్‌ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంగ్ల అక్షరాలతోపాటు నంబర్లను కూడా పాస్‌వర్డ్‌లో భా గం చేయడం మంచిది. అన్ని అప్లికేషన్లకు కూడా ఒకే విధమైన పాస్‌వర్డ్‌ను వాడకపోవడం మరీ మంచిది.

*అధీకృత అప్లికేషన్లనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

అధీకృత వెబ్‌సైట్లు లేదా యాప్‌ స్టోర్స్‌ నుంచి మాత్రమే పేమెంట్‌ అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వీటి వల్ల సమాచారం చోరీ కాకుండా ఉం టుంది. అప్లికేషన్లకు సంబంధించిన కొత్త వెర్షన్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లను పొందవచ్చు. నెట్‌వర్క్‌ విషయంలో జాగ్రత్త : నగరాల్లోని కొన్ని చోట్ల ఉచితంగా వైఫై సదుపాయం లభిస్తుంది. దీన్ని వినియోగించే ముం దు జాగ్రత్త. ఉచిత వైఫై అని వినియోగిస్తే లాగిన్‌కు సంబంధించిన సమాచారం తస్కరణకు గురికావచ్చు. అవసరం లేని సందర్భంలో బ్లూటూత్‌/నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సి) కనెక్షన్లను ఆఫ్‌ చేసి ఉంచడం మరవొద్దు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved