రక్త సంబంధాలకు విలువివ్వండి

అరవై ఏళ్ళ శివరామయ్య ఆసుపత్రి బెడ్ మీద అపస్మారకస్థితిలో పడిఉన్నాడు. డాక్టర్లు అతని పరిస్థితి చాలా సీరియస్, ఎక్కడికైనా పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్పారు.అతని భార్య ఆ బెడ్ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంది. అక్కడున్న బంధువులు, మిత్రులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.కానీ ఆమె ఏడుపు ఆగడం లేదు.

కొద్దిసేపటికి శివరామయ్య తమ్ముడు రఘునాథ్ ఆ ఆసుపత్రి రూమ్ వద్దకు వచ్చాడు. బెడ్ ప్రక్కన తన అన్నయ్యను చూస్తూ నిలబడ్డ రఘునాథ్ తో శివరామయ్య భార్య మాట్లాడుతూ, " మీ అన్నయ్యను హైదరాబాద్ లో పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళమన్నారు. నీ కారు ఉంది కదా......అది ఇవ్వు.......దానిలో ఎక్కించుకొని మీ అన్నయ్యను ఆసుపత్రికి తీసుకువెళతాము " అని అడిగింది.

దానికి రఘునాథ్ మాట్లాడుతూ, " వదినా......! అది కొత్త కారు. ఇంటికి తీసుకొచ్చి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే అంత దూరం అంటే ఎలా.....? పూర్తిగా దుమ్ము పట్టి పోతుంది. అయినా.....ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు ......... ఈ కొత్త కారులో వెళ్ళడం ఎందుకు........? దారిలో వెళ్ళేటప్పుడు కొత్త కారులో అన్నయ్యకు జరగరానిది ఏదైనా జరిగితే.........., కొత్తకారులో దుశ్శకునం అని నా భార్య కారును కనీసం తాకనైనా తాకదు........కాబట్టి మీరు మరో వాహనంలో వెళ్ళండి...." అని అనేసరికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. శివరామయ్య భార్యకు నోట మాట రాక , అలాగే చూస్తూ ఉండి పోయింది.

అక్కడున్న బంధువుల లో నుండి ఒక పెద్దాయన కల్పించుకొని, " రఘునాథ్.......! నువ్వేం మాట్లాడుతున్నావో......నీకు అర్థం అవుతోందా..........? సొంత అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే ...........అర్జెంట్ గా అని కారును అడిగితే........., నీకు అన్నయ్య కంటే కారే ఎక్కువయ్యిందా...........! నీ చదువు కోసం మీ అన్నయ్య పడ్డ కష్టాన్ని మరిచిపోయావా........? నీ పెళ్ళైన మొదట్లో నీ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ అన్నయ్య చేసిన సాయాన్ని మరిచిపోయావా.......? " అని అతను ఎంతగా చెప్పినా........... తన కారును ససేమిరా ఇవ్వనంటే......ఇవ్వను అని రఘునాథ్ తెగేసి చెప్పాడు. అక్కడున్నవారంతా రఘునాథ్ పాడుబుద్ధిని ఛీ కొడుతూ పక్కకు వచ్చేశారు.

ఇక చేసేదిలేక , వేరే వాహనంలో శివరామయ్యను హైదరాబాద్ కు తీసుకువెళ్ళారు.

రక్తసంబంధాలకు విలువివ్వకుండా ఇలా ప్రవర్తించే వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉంటారు.

వాళ్ళు మనుషులను ప్రేమించరు. వస్తువులను ప్రేమిస్తారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved