ఒక క్లాస్ లో విద్యార్థులు ఒకరి కొకరు ద్వేష భావం పెంచుకుంటున్నారని గమనించిన ఆ క్లాస్ టీచర్ వారిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుంది.

ఒకరోజు క్లాస్ లో విద్యార్థులందరితో, ' మీరు ఈ క్లాసు లో ఎంత మందినయితే ద్వేషిస్తున్నారో, అన్ని బంగాళా దుంపలు తెచ్చుకోండి. వాటిని ఒక పాలిథిన్ కవర్లో ఉంచి గట్టిగా మూతికట్టు బిగించి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వెంటనే వాటిని కూడా తీసుకెళ్ళండి. నేను చెప్పేంత వరకు ఆ పాలిథిన్ కవర్లను ఎవరూ తెరవకండి' అని ఆ టీచర్ చెప్పింది.

ఆమె చెప్పినట్లే అందరు విద్యార్థులూ చేసారు. కొందరు రెండు,మూడు, నాలుగు .... ఇలా వారికి ఎంత మంది మీద ద్వేషభావం ఉందో అన్ని బంగాళాదుంపలను పాలిథీన్ కవర్లలో ఉంచుకొని వారు వెళ్ళిన చోటికంతా ఆ కవర్లను వెంట తీసుకెళ్ళడం మొదలుపెట్టారు.

రోజులు గడిచే కొద్దీ విద్యార్థులంతా ఒకరి తర్వాత ఒకరు ఆ బంగాళా దుంపల కవర్లు చాలా దుర్వాసన వేస్తున్నాయని, భరించలేకుండా ఉన్నామని టీచర్ కు కంప్లైంట్లు ఇవ్వసాగారు.

అలా వారం రోజులు గడిచిన తర్వాత ఒక రోజు టీచర్ విద్యార్థులతో, ' మీరు ఈ వారం రోజులు ఆ బంగాళాదుంపలను మీ వెంటే ఉంచుకున్నందుకు ఎలా ఫీల్ అయ్యారు ' అని అడిగింది. వెంటనే విద్యార్థులంతా, వాటి వాసన భరించలేక పోయాం........., వాటిని మోసుకొని ప్రతి చోటికీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాం....., అని పలు రకాలుగా కంప్లైంట్లు చెప్పారు.

అపుడు టీచర్, బంగాళాదుంపలను పాలిథీన్ కవర్లలో అలా ఉంచి , ఎందుకు విద్యార్థులను తమ వెంటే తీసుకువెళ్ళమని చెప్పడంలోని అసలు విషయాన్ని వారితో చెప్పింది.

' మీరు బంగాళాదుంపలను మీతో పాటు ఉంచుకోవడానికి , వాటి వాసన భరించలేక అందరూ ఎంతగా ఇబ్బంది పడ్డారో మీకు అర్థమయింది కదా....! వాసనతో కూడిన బంగాళాదుంపలనే వారం కంటే ఎక్కువ రోజులు భరించలేకపోయారే.....!, అలాంటిది ఎదుటివారి మీద ద్వేషభావాన్ని మీ గుండెల నిండా ఉంచుకొని ఎలా భరించగలుగుతున్నారు. అంతటి ద్వేషభావం మీలో ఉంటే మీ గుండెలకు అది ఎంతటి హాని కలిగిస్తుందో.....!, మీ జీవితాంతం దాన్ని భరిస్తే, మీ మీద అది ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో.....! మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.

మీ గుండెల్లో ఉన్న ద్వేష భావాన్ని ఇప్పుడే వదిలివేయండి. మీరు అలా ద్వేషించుకుంటూ వెళితే, చివరకు ఈ ప్రపంచంలో ఎవరూ మిగలరు. మీరు ఒక్కరే ఒంటరిగా మిగులుతారు.అందరినీ చిరునవ్వులతో పలకరించండి.అందరితో ప్రేమాభిమానాలతో మెలగండి. అప్పుడు ఈ ప్రపంచం ఎంత అందంగా కనిపిస్తుందో..........., మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో........ ఒక్కసారి చూడండి' అని ఆ టీచర్ విద్యార్థులలో మార్పుకు శ్రీకారం చుట్టింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved