ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత

ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము (నెల) కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు . . . అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు .

ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు . ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం . అనగా . . . ఇది రాత్రి కాలం . మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం . అనగా . . . పగలుగా భావన . ఇలా భావిచినప్పుడు . . . దక్షిణాయనమునకు చివరిది . . . ఉత్తరాయణమునకు ముందుది ఐన ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది . . . సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది . కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు . . . ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు.

ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.

కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.

ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.

ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది.

ధనుర్మాసం ఫలశ్రుతి:

ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్క రోజు అయిన మనసా వాచ కర్మణా యదాశక్తిగా పూజించిన యెడల 1000 యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితము కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలోకాని లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ పుణ్య స్థలంలోకాని లేదా ఒక చెరువు లోకాని మీకు తోచిన పుణ్య స్థలంలో ఒక్క మునుగు మునుగిన 4 రెట్లు అశ్వమేధయాగం చేసిన ఫలితము దక్కును.

special story

ధనుస్సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.

మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు. తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు.

ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు. ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటిబయట ముంగిళ్ళలో గోమయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు.

అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈమాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా ఉత్తరద్వార దర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిక కోరికలను తీర్చేది గోపూజ. ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గశి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. తిరుప్పావై పారాయణ ఈరోజు నుండి మొదలు. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేక ప్రాధాన్యం. హేమంత ఋతువు లో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయం గా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు. చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు.ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది.

సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం లో పసుపు, ఆవాలు, మెంతులు , మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, మనం తీసుకొనే ఆహార పదార్దాల లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు.

మార్గశిర శుద్ద పంచమి రోజున నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది.

మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి.

మార్గశిర శుద్ద సప్తమి ని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి.

మార్గశిర అష్టమి ని కాళభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.

మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వారా దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసం లో వచ్చే ద్వాదశి ని అఖండ ద్వాదశి అంటారు. మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమత్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు. మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామీ ని నోరార పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.

కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు.మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకం గా ఈ దినం యమధర్మ రాజుని ఆరాదిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

ధనుర్మాసం ప్రారంభమైంది.. శ్రీ కృష్ణుడిని పూజించండి కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్యమీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ప్రతినెలా ఒక్కోరాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యాది గ్రహాల అంతర గమనాన్ని సంక్రాంతి అంటారు. ఇలా సూర్యుడు పుష్యమాసంలో మకరరాశిలోకి సంక్రమణం చెందుతాడు. దీన్నే మకర సంక్రాంతి అంటారు. ఇదేవిధంగా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మకరరాశిలోకి ప్రవేశించే వరకు ఉన్న కాలాన్నే "ధనుర్మాసం" అంటారు.

ఈ ధనుర్మాసంలోనే శ్రీవిల్లిపుత్తూరులో ఆళ్వార్ కుమార్తెగా పెరిగిన లక్ష్మీదేవి అవతారమైన ఆండాళ్ మాత విష్ణుమూర్తిని పెళ్ళాడాలని సంకల్పించి నోము ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ నోము ఫలితంగా ఆండాళ్ దేవి కృష్ణభగవానుడినే భర్తగా పొందిన విషయం అందరికీ తెలిసిందే. అందుచేత ఈ ధనుర్మాసంలో నోమును ఆచరించే కన్యలు వారి మనస్సు మెచ్చిన వ్యక్తినే భర్తగా పొందుతారని పండితులు అంటున్నారు అట్టి మహిమాన్వితమైన ఈ మాసంలో ఇళ్ళముందు.. పేడతో కళ్లాపుచల్లి రంగవల్లులు తీర్చిదిద్ది వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను పెడతారు. గొబ్బిళ్ళమీద, ఈ కాలంలో పూసే రకరకాల పూలను అలంకరిస్తారు. ఇలా సంక్రాంతి పండుగ వచ్చేంతవరకు అందరూ తమ తమ ఇళ్లముందు రంగవల్లులతో అలంకరించి.. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు.

ఇంకా దేవతా పూజలకు ధనుర్మాసం విశిష్టమైంది. అందుకే ఈ మాసంలో ధనుర్మాసంలో శుభకార్యాలను పక్కన బెట్టి దేవతలను పూజించాలని పండితులు అంటున్నారు. దేవతలతో పాటు కృష్ణభగవానుడికి ప్రీతికరమైన ఈ ధనుర్మాసం పూర్తిగా ఆ భగవానుడిని స్మరిస్తూ పూజ చేసే వారి అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. ఇంకా పెళ్లికాని కన్యలు ధనుర్మాసంలోని 30 రోజులు దీక్షతో ఆ దేవదేవుడిని ప్రార్థిస్తే గుణవంతుడైన భర్తను పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు. అందుచేత ఈ మాసం పూర్తిగా విష్ణుమూర్తిని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందుదుము గాక..!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved