మీకు ఆకలి వేయడం లేదా..! ఏమీ తినాలనిపించడం లేదా....! అయితే ఒక్కసారి దీనిని చదవండి. ఆకలిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. విస్తట్లో పంచభక్ష్యపరమాన్నాలు ఉన్నా కొందరికి ముద్ద నోట్లోకి దిగదు. అదేమిటంటే ఆకలిగా లేదంటారు. జీర్ణక్రియలో లోపాల వల్లే ఆకలి సరిగా ఉండదు. ఇవి పాటించండి. ఆకలిని పెంచుకోండి. • నిమ్మరసం : జీర్ణక్రియను వేగవంతం చేయడంలో నిమ్మరసం భలేగా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలిగించి ఆకలి పుట్టేలా చేస్తుంది. ఆకలి మందగించినపుడు గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోండి. కాసేపటికి అన్నమో రామచంద్రా అనకమానరు...! • ఖర్జూరాలు : పోషక విలువులు మెండుగా ఉన్నా ఖర్జూరాలకు ఆకలి పుట్టించే గుణం కూడా ఎక్కువే. దీన్ని రసంలా చేసి కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ నాలుగైదు ఖర్జూరాలు తింటే ఆకలి లేమి తీరిపోతుంది. • అల్లం : వికారం, అజీర్తికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ నాలుగైదు అల్లం ముక్కలను దవడన పెట్టుకుని నమిలి, ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. దీనివల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆకలి కూడా బేషుగ్గా వేస్తుంది. • మెంతులు : పొట్టలో గ్యాస్‌ను బయటకు తోసేయడంలో మెంతులు బాగా పని చేస్తాయి. దీంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ మెంతిపొడిని తేనెతో కలిపి తగిన మోతాదులో తీసుకుంటే ఆకలి పుడుతుంది. • ద్రాక్ష : ద్రాక్షలో విటమిన్‌-సి ఉంటుంది. అది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. భోజనం చేశాక కొన్ని ద్రాక్షపళ్లు తినండి. తీసుకున్న ఆహారం తొందరగా అరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved