అక్కడ కట్నం అనే పేరు వినిపిస్తే చాలు.. పెళ్లికొడుకుతో సహా ఆ కుటుంబానికంతా గ్రామ బహిష్కరణే.!?

ఆఊరి పేరు సిద్దార్డ్ నగర్, ఉత్తర ప్రదేశ్ జిల్లాలో ఉంటుంది. ఆ గ్రామంలో కట్నం తీసుకోవడం నిషేదం. నిషేదం అంటే ఏదో మొక్కుబడిగా కాదు. కట్నం తీసుకున్న ఫ్యామిలీ మొత్తాన్ని నిర్దాక్షిణ్యంగా గ్రామం నుండి బహిష్కరిస్తారు. ఇందులో ఏ కులం వారికైనా ఎటువంటి మినహాయింపులుండవ్. వరకట్న సమస్యను పూర్తిగా రూపుమాపడానికి ఆ గ్రామ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగని ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఇక నుండి మా గ్రామస్థులం ఎవ్వరం కట్నం తీసుకోం అంటూ ప్రతిజ్ఙ కూడా చేశారు. ఈ విప్లవాత్మక నిర్ణయానికి కారణం ఓ చదువుకున్న యువకుడు అతని పేరే అంజుమన్ రజా ఇ-ముస్తఫా. వరకట్న సమస్యను అంతం చేయడానికి అడుగు ముందుకేశాడు. ఆయన బాటలోనే అక్కడిస్థానికులు మరియు గ్రామ యువత అంతా నడుస్తున్నారు.వరకట్న ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు పెళ్లి సమయంలో దుబారా ఖర్చులు చేసినా, ఆర్భాటాలకు పోయి ఎక్కువ మొత్తంలో పెళ్లికి ఖర్చు పెట్టినా కూడా నేరమే, మేమూ దానికి వ్యతిరేఖం అంటూ ప్రతిజ్ఙలో చేర్చాడు ముస్తఫా.ఈ నిర్ణయానికి కట్టుబడి, పెళ్లి ఖర్చులు తగ్గించుకుంటున్నారు ఆ గ్రామస్థులు.

ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉందట. వరకట్నం కారణంగా 2012,13,14 సంవత్సరాలలో 24,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరప్రదేశ్ లలో మాత్రమే 7,048 మరణాలు సంభవించాయి. ప్రాణాలు కోల్పోవడానికి కూడా దారి తీస్తుండడంతో వరకట్న సమస్యను తీర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతాడు ముస్తఫా.

ఆడపిల్ల పుట్టగానే ఖర్చులు ఎక్కువని, పెద్దయ్యాక పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని చాలా బరువు బాధ్యతలున్నాయని, భూమి మీద పడ్డ మరుక్షణం నుండీ ఆడపిల్లను భారంగానే చూస్తున్నారు.ఆడపిల్లకు చదువెందుకని,కొన్ని సంవత్సరాలకు వరకు చదివించడం, ఆడపిల్ల ఉందని, తన కూతురి పెళ్లి కోసమని చిన్నప్పటి నుండే డబ్బులు దాయడం, మగపిల్లల కంటే తక్కువగా చదివించడం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆడపిల్లను తక్కువగా చూస్తూ,చులకనగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్ల కుటుంబానికి రాకూడదని, వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం తప్పుగా భావిస్తూ ఇక్కడ వరకట్నంను రూపుమాపారు. ఇక్కడ 120 ముస్లిం కుటుంబాలు మరియు 80 హిందూ కుటుంబాలు ఉన్నాయి. తమ పిల్లలను ఎటువంటి ఒత్తిడులు లేకుండా సంతోషంగా చదివించుకుంటూ, వరకట్నం, అమ్మాయి పెళ్లి గురించి మాకెటువంటి భయంలేదంటూ గర్వంగా చెబుతున్నారు ఈ గ్రామస్థులు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved