ఏదో ఒక పేరు చెప్పి గిఫ్ట్‌ వచ్చిందంటూ ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు వలవేసి ఒడుపుగా వేలకువేలు రీచార్జి చేయించేసుకుంటున్న ముఠా ఒకటి బయల్దేరింది. లక్నో కేంద్రంగా ఈ ముఠా తన కార్యకలాపాలు సాగిస్తోంది. తస్మాత్‌ జాగ్రత్త. ఈ ముఠా చేతిలో మోసపోయిన ఖాదర్‌ వలీ అనే బాధితుడి కథ వింటే వారు ఈ మోసాన్ని ఎలా కొనసాగిస్తున్నారో అర్థమవుతుంది.

ఎలా మోసం చేసారో.......ఒక్కసారి చదవండి.

హైదరాబాద్‌ మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి ఖాదర్‌ వలీకి ఎయిర్‌టెల్‌ హెడ్‌ ఆఫీస్‌ నుంచి చేస్తున్నామంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ''మీరు ఎయిర్‌టెల్‌ ఫోన్‌ నంబర్‌ ఉపయోగిస్తున్నారు. లాటరీలో మీ నంబర్‌కు రూ.1100 గిఫ్ట్‌ వచ్చింది. మీరు సమీపంలోని ఎయిర్‌టెల్‌ ఔట్‌లెట్‌కు వెళ్లి రూ.1100 తెచ్చుకోవచ్చు. లేదా అంతే మొత్తానికి రీచార్జి చేసుకోవచ్చు'' అని చెప్పాడు. ఆ ఆఫర్‌ 30 నిమిషాలపాటు మాత్రమే ఉంటుందని.. ఫోన్‌ తీసుకుని నేరుగా ఎయిర్‌టెల్‌ కేంద్రానికి వెళ్లాలని సూచించాడు. అక్కడికి వెళ్లాక, ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ ఔట్‌లెట్‌లో వ్యక్తికి ఇవ్వాలని, తాను అతడితో మాట్లాడతానని.. తాను మాట్లాడినంతసేపూ అతడిని 'అయిందా.. అయిందా' అని అడగాలని ఖాదర్‌వలీకి చెప్పాడు. గిఫ్ట్‌ విషయం మాత్రం పొరబాటున కూడా దుకాణదారుడికి చెప్పొద్దని, అలా చెప్తే వారే ఆ సొమ్మును కాజేస్తారని హెచ్చరించాడు. ఆ మాటలన్నీ అమాయకంగా నమ్మిన ఖాదర్‌వలీ అవతలి వ్యక్తి లైన్‌లో ఉండగానే నేరుగా సమీపంలోని ఎయిర్‌టెల్‌ ఔట్‌లెట్‌కు వెళ్లాడు. ఫోన్‌ను అక్కడున్న వ్యక్తికి అందించాడు. అంతే.. లైన్‌లో ఉన్న అవతలి వ్యక్తి దుకాణదారుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడు మాట్లాడుతున్నంతసేపూ దుకాణదారుడిని ఖాదర్‌వలీ 'అయిందా.. అయిందా' అని అడుగుతూనే ఉన్నాడు. 'అవుతుంది.. అవుతుంది' అని దుకాణదారుడు చెప్పసాగాడు. అవతలి వ్యక్తి అలా నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూ.. 10 నంబర్లకు రూ.18వేల వరకు రీచార్జి చేయించుకున్నాడు. అందులో ఖాదర్‌వలీ నంబర్‌కు కూడా రూ.2000 చొప్పున రెండుసార్లు రీచార్జి చేయించాడు. ఆ నాలుగువేలు పోను మిగతా 14 వేలూ తనకు కావాల్సిన నంబర్లకే రీచార్జి చేయించుకున్నాడు. అంతా అయిపోయి అతడు ఫోన్‌పెట్టేయగానే.. దుకాణదారుడు ఖాదర్‌వలీ ఫోన్‌ను అతడి చేతిలో పెట్టి రూ.18 వేలు బిల్లు చెల్లించమన్నాడు. ఖాదర్‌వలీ లబోదిబోమన్నాడు. తాను 18 వేలు ఎందుకు చెల్లించాలని ఆగ్రహంగా అడిగాడు. 'మీ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తే రూ.18 వేలకు రీచార్జి చేయించాడు కాబట్టి మీరే చెల్లించాలి' అని స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్యా వాగ్వివాదం జరిగింది. చివరకు ఇద్దరూ హుమయూన్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుకాణదారుడు తనపై తెస్తున్న ఒత్తిడి తట్టుకోలేక... ఖాదర్‌వలీ అతడికి రూ.5000 చెల్లించాడు. మిగతా సొమ్ము చెల్లించాలని అతడు బెదిరింపులకు దిగడంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ''వేలకు వేలు ఎలా రీచార్జి చేశావ''ని దుకాణదారుడిని సైబర్‌ క్రైం ఏసీపీ అనురాధ మందలించారు.

రీచార్జి చేయించుకోవడానికి తరుచుగా తన దుకాణానికి రావడంతో తెలిసిన వారే కదాని రీచార్జి చేశానని అతడు బదులిచ్చాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ''లక్నో ఎయిర్‌టెల్‌ కార్యాలయం'' పేరుతో ఒక ముఠా ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. ఖాదర్‌వలీతో మాట్లాడింది రాజీవ్‌ అనే యువకుడని గుర్తించారు. అతను కొద్ది కాలం బేగంపేటలో కూడా పనిచేసినట్టు సమాచారం ఉంది. ఎయిర్‌టెల్‌ వినియోగాదారులపైనే ఈ ముఠా ఈ విధమైన గాలాన్ని విసురుతున్నట్టు సమాచారం. ఓ మహిళ నాయకత్వంలో పదిమంది ముఠా రీచార్జి మోసాలకు పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. గిఫ్ట్‌ పేరుతో వచ్చిన ఫోన్లకు స్పందించి మోసపోవద్దని ప్రజలకు సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. అదే విధంగా వేలకు వేలకు రీచార్జి చేసే ముందు దుకాణదారులు ఖాతాదారులను అడిగి నిర్ధారించుకున్న తర్వాతే రీచార్జి చేయాలని చెబుతున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved