ఇక మూడు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ పొందొచ్చు

ప్రజలకు పాస్‌పోర్ట్‌ తీసుకోవడం మరింత చౌకగా, సరళంగా, త్వరగా పూర్తికావడం కోసం విదేశాంగ శాఖ తాజాగా కొత్త పథకం ప్రవేశపెట్టిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి కె.బాలమురుగన్‌ తెలిపారు. కొత్త విధానం ద్వారా కేవలం మూడు రోజుల్లో పాస్‌పోర్టు పొందే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం కేవలం ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, ఫోటో ఓటర్‌ గుర్తింపు కార్డు సహా పాస్‌పోర్ట్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న ‘అనెక్సర్‌-1’ను పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కొత్త విధానంలో పాస్‌ పోర్ట్‌ జారీ చేసిన తరువాత పోలీసు తనిఖీ ఉంటుందన్నారు. గతంలో తత్కాల్‌ విధానంలో జారీ చేస్తున్న విధంగానే ప్రస్తుతం దరఖాస్తు దారులందరికీ తక్కువ సమయంలో పాస్‌పోర్టులు జారీ చేస్తున్నామన్నారు.

ఇందుకోసం దరఖాస్తుదారుడు రూ.2 వేలు అదనంగా చెల్లించనవసరం లేదని తెలిపారు. అయితే క్రిమినల్‌ రికార్డు కలిగిన వారికి పాస్‌పోర్టులు జారీ చేయరని ప్రకటించారు. అంతేకాకుండా కొత్త విధానంలో వినియోగదారుడు తనకు వీలున్న ఐదు రోజుల్లో ఒక రోజు కార్యాలయానికి రావడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. పాస్‌పోర్ట్‌ జారీని వేగవంతం చేయడానికి కేంద్ర విదేశాంగశాఖ ‘మొబైల్‌ పాస్‌పోర్ట్‌ పోలీస్‌ యాప్‌’ ని రూపొందించిందని తెలిపారు. ఈ విధానం ఇప్పటికే హైదరాబాదు పోలీసులు విజయవంతంగా వినియోగిస్తున్నారని, త్వరలో చెన్నైలో కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని బాలమురుగన ప్రకటించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved