ఈ ఏడాది పలు గ్రహణాలు

ఈ ఏడాది అంతరిక్షంలో ఐదు గ్రహణాలు ఖగోళశాస్త్ర ప్రియులకు కనువిందు చేయనున్నాయి. వీటిలో రెండింటిని మాత్రమే భారత్లో వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ ఖగోళ ఘటనలు మార్చి 9న సంభవించే సూర్యగ్రహణంతో ప్రారంభమవుతాయి. ఈ సూర్యగ్రహణం ఈశాన్య భారతంలో పాక్షికంగా కనిపిస్తుందని ఉజ్జయినిలోని జీవాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రకాశ్ గుప్త్ ఆదివారం చెప్పారు. అదే నెల 23న చంద్రగ్రహణం సంభవిస్తుందని, అయితే అది భారత్లో కనిపించదని అన్నారు. ఆ తరువాత ఆగస్టు 18న మరో చంద్రగ్రహణం, సెప్టెంబర్ ఒకటిన కంకణాకార సూర్యగ్రహణం సంభవిస్తుందని, ఈ రెండింటిని కూడా భారత్లో వీక్షించే అవకాశం లేదని తెలిపారు. ఇక ఈ ఏడాది చివరి ఖగోళ ఘటన సెప్టెంబర్ 16న సంభవిస్తుందని డాక్టర్ గుప్త్ చెప్పారు. ఆ రోజున సంభవించే చంద్రగ్రహణాన్ని భారత్లో చూడవచ్చని తెలిపారు. సూర్యుడు, భూమి, చంద్రుడు దాదాపు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుని వెలుగు నేరుగా చంద్రునిపై పడకుండా కొంత భాగాన్ని భూమి తన నీడతో అడ్డుకుంటుంది. భూమి నీడను పెనంబ్రా అంటారని వివరించారు. ఈ ఏడాది అన్నీ పెనంబ్రల్ చంద్ర గ్రహణాలే సంభవిస్తాయని తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved