అయ్యప్ప భక్తుడికి తోడుగా.. 600 కిలోమీటర్లు తోడు వెళ్లిన శునకం.. చివరికి

అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని.. అయ్యప్ప భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడక ద్వారా శబరిమల చేరుకుంటారు. అయితే ఇలా చేరుకునే ఘటనలలో ఓ ఆసక్తి కరమైన ఘటన చోటు చేసుకుంది. కేరళలోని కోజికోడ్‌కు చెందిన 38 ఏళ్ల నవీన్ అయ్యప్ప భక్తుడు కావడంతో.. ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు. ఇరుముడి నెత్తిన పెట్టుకొని 600 కి.మీ. దూరంలో ఉన్న శబరిమలకి కాలినడకన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. తొలి రోజు ఒక్కడే నడక మొదలు పెట్టగా.. రెండో రోజు అతడికి ఓ వీధి కుక్క తోడుగా వచ్చింది.

ఆ కుక్కని తరుముతున్నా కూడా అది వెళ్లడం లేదు. ఎంతగా వెళ్లగొట్టినా అది అతడి వెంటే వచ్చింది. దీనితో నవీన్ స్వామి దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నాన్ని విరమించుకొని తన వెంట రానిచ్చాడు. వందల కిలోమీటర్ల దూరం అతడి వెంట రావడంతోపాటు.. అతడి వస్తువులకు కాపలా కాసింది. ఫోన్ పనిచేయని సమయంలో ఆ శునకమే అతడిని నిద్రలేపేది. అయితే.. శబరిమల చేరుకున్నాక కొండపై ఆ శునకం తప్పి పోయింది. ఇంత దూరం తనకు తోడుగా వచ్చిన నేస్తం తప్పిపోయినందుకు నవీన్ స్వామి ఎంతో బాధపడ్డాడు.

తోటి స్వాములను అడగ్గా.. రెండు రోజులుగా దేవాలయానికి వెళ్లే మెట్ల వద్ద ఓ శునకం ఎవరి కోసమో ఎదురు చూస్తూ కనిపించిందని.. ప్రతి స్వామిని వాసన చూస్తోందని చెప్పారు. దీంతో నవీన్ పరుగున అక్కడకు వెళ్లి చూడగా.. ఆ శునకం ఆనందంతో తన ముందరి కాళ్లతో నవీన్‌ స్వామి చుట్టేసింది. ఏ బంధము లేని ఆ శునకం చూపించిన ప్రేమకు చలించిన నవీన్ స్వామి.. ఆ శునకాన్ని తనతోపాటు ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ శునకం నవీన్ స్వామి తోపాటే ఉంటుంది. అతడు దానికోసం ప్రత్యేకంగా ఓ కార్డ్ బోర్డు బాక్స్‌ ని కూడా ఏర్పాటు చేసి.. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు నవీన్ స్వామి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved