చదివింది మూడో తరగతే కానీ‘పద్మశ్రీ’ అందుకున్నాడు

చదువూ లేదా ఆర్థిక పరిస్థితీ మాత్రమే మనిషి గొప్పవాడు అనిపించుకోవటానికి కారణం అని చెప్పలేం. అతను చదువుకున్నది కేవలం మూడో తరగతి కనీసం

హైస్కూలుకు కూడా వెళ్ళలేదు… అయినా ఇప్పుడు దేశపు అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డ్ ని అందుకున్నాడు. మూడో తరగతితో బడి మానేసిన వ్యక్తిని భారతదేశ ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. ఆయన జీవితంపై ఐదుగురు పరిశోధకులు పీహెచ్‌డీ థీసిస్‌లు రాశారు. సంబల్‌పూర్ విశ్వవిద్యాలయం ఆయన రాసిన కవితలు, రచనలను సేకరించి, ముద్రించాలని ప్రయత్నాలు చే్స్తోంది.

కోస్లి భాషలో స్ఫూర్తిదాయక రచయితగా పేరొందిన హల్దార్ నాగ్‌కు సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆయన పశ్చిమ ఒడిశా ప్రాంతీయుడు. ఆయన సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆయన అనేక పద్యాలు, 20 రచనలు చేశారని, అవన్నీ ఇప్పటికీ ఆయనకు గుర్తు ఉండటం విశేషమని చెప్పారు. ఆయన రాసినవాటిలో ఏది అడిగినా చెప్పే సామర్థ్యం ఆయనకు ఉందన్నారు. ఇప్పటికీ ఆయన రోజూ కనీసం నాలుగు కార్యక్రమాల్లో పాల్గొంటూ, తన పద్యాలను పాడుతూ ఉంటారని తెలిపారు.

నాగ్ తన జీవితంలో ఎప్పుడూ చెప్పులు ధరించలేదు. ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయనకు పదేళ్ళ వయసులోనే తండ్రి మరణించడంతో మూడో తరగతితోనే బడి మానేయాల్సి వచ్చింది. స్థానిక స్వీట్ షాపులో పాత్రలు కడుగుతూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవారు. భర్త పోయిన మహిళ జీవితం చాలా దుర్భరమని ఆయన చెప్తూ ఉంటారు. రెండేళ్ళ తర్వాత ఓ గ్రామ పెద్ద ఆయనను ఓ హైస్కూలుకు తీసుకెళ్ళి వంటవాడిగా పని ఇప్పించారు. అప్పటి నుంచి పదహారేళ్ళ పాటు అక్కడే పనిచేశారు.

అనంతరం ఆ ప్రాంతంలో చాలా పాఠశాలలు ఏర్పాటు కావడంతో బ్యాంకు నుంచి రూ.1,000 అప్పు సంపాదించి, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, తినుబండారాలు అమ్మడం కోసం దుకాణాన్ని తెరిచారు. ఆ కాలంలోనే (1990లో) ఆయన తన మొదటి పద్యం ‘ధోడో బర్గచ్’ (పాత మఱ్ఱి చెట్టు)ను రాశారు. అది స్థానిక పత్రికలో ప్రచురితమైంది. ఆయన నాలుగు పద్యాలను ఆ పత్రికకు పంపించారు. అవన్నీ ప్రచురితమయ్యాయి. ఆ సంఘటన తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని నాగ్ చెప్పారు. అప్పటి నుంచి పొరుగు ఊళ్ళకు వెళ్ళి తాను రాసిన పద్యాలను పాడుతూ ఉంటే, ప్రజలు చాలా మెచ్చుకునేవారని వివరించారు. ఒడిశాలో ఆయన ‘లోక్ కబి రత్న’గా సుపరిచితులు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved