కంటి నిండా నిద్రకు చల్లటి చిట్కాలు

కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేకపోతే పని చేయడానికి కాళ్లు చేతులు ఆడవంటారు పెద్దలు. పెద్దల మాట సద్దిమూటగా పక్కనబెడితే.. కడుపు నిండా తిండి ఉన్నా కంటి నిండా నిద్రలేకపోతే మాత్రం కాళ్లు చేతులు ఆడని మాట వాస్తవం. అలాంటి సమయంలో చురుగ్గా పనిచేయాలంటే చిర్రెత్తుకొస్తుంది. గదిలో ఉష్ణోగ్రత 24 డిగ్రీలను దాటి పోతే నిద్ర పట్టడం కష్టమే. పట్టినా రాత్రిళ్లు పదే పదే మేల్కొచ్చి మనసున పట్టదు. ఏసీలుగల వారికి ఓకే. మరి అవిలేని మధ్య తరగతి ప్రజల పరిస్థితి మాటేమిటి. ఇలాంటివాళ్ల కోసమే ఈ చల్లని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.

1. పడక గదిలో తలగడ పక్కన టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవాలి. దాని ముందు ఐస్ ట్రే ఉంచాలి.

2. వీలైతే తలగడను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తీసుకోవాలి.

3. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పడక గది కిటికీల తెరలు పగలంతా మూసి ఉంచాలి.

4. పడుకునే ముందు వదులైన దుస్తులు ధరించడమే కాకుండా కాళ్లు, చేతులు చల్లటి నీళ్లతో కడుక్కోవాలి

5. పడకపై పలుచటి దుప్పట్లను మాత్రమే వినియోగించాలి.

6. రాత్రి పూట మసాలా ఫుడ్డు, వేడి వేడి కాఫీలు తీసుకోవద్దు.

7. కీర దోసకాయ లేదా పుచ్చకాయ లేదా చల్లటి పాలు తీసుకోవాలి.

ఈ చిట్కాలన్నీ పాటిస్తే కచ్చితంగా పడక గది చల్లగా ఉంటుందని, చల్లగా నిద్ర పడుతుందని, ఏసీలు కూడా ఈ చిట్కాల ముందు దిగదుడుపేనని నిపుణులు సవాలు చేస్తున్నారు. ప్రయత్నించి చూస్తే పోలా! వర్షాల వల్ల ఈ పాటికే వాతావరణం చల్లబడితే వచ్చే వేసవిలో చిట్కాలు పాటిద్దాం!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved