చిత్రంలో ఎన్టీఆర్ తో ఉన్న కైకాల సత్యనారాయణను, సినిమాల్లోకి రాకముందు ఆయన మిత్రులందరూ పోలికలో ఎన్టీఆర్ లాగా ఉన్నావని అనేవారంట

ఏనాడైనా సినీరంగంలో చేరి, ఎన్టీఆర్ అంతటి వాడు కావాలని కలలు కనేవారంట. ఈ ప్రయత్నంలోనే ఎన్టీఆర్ ను కలవగా ఆయన తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో మొదటి అవకాశమిప్పించారు . అందులో యువరాజు పాత్ర వేసిన సత్యనారాయణ చూపులకు ఎన్టీఆర్ లాగా ఉన్నాడని విన్న, డి ఎల్ నారాయణ 'సిపాయికూతురు'లో హీరోగా వేషం వేయించారు. అంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ కు ఎంత స్టార్ హోదా ఉండేదో అర్థమవుతుంది. అయితే ఆ చిత్రం పరాజయంపాలు కావడంతో, బిట్ రోల్స్ తోనే ముందుకు సాగిన సత్యనారాయణ... యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన పలు చిత్రాల్లో ఆయనకు డూపుగా నటించారు. ఎన్టీఆర్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం రాముడు -భీముడులోనూ చాలా చోట్ల ఎన్టీఆర్ డూప్ గా కైకాల స్పష్టంగా కనిపిస్తారు. తరువాత ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ విలన్ గా నిలిచారు కైకాల సత్యనారాయణ. విలన్ గా రాణిస్తున్న సమయంలోనే సత్యనారాయణ చేత తన స్వీయ నిర్మాణంలో రూపొందిన 'ఉమ్మడి కుటుంబం' చిత్రంలో సెంటిమెంటు ప్రాధాన్యమైన సాత్విక పాత్రలో కైకాలను నటింపచేసి, ఆయనకు నటుడిగా మరో ఇమేజిని ఇచ్చారు ఎన్టీఆర్.

అలా అడుగడుగునా తన ఎదుగుదలకు ఊతమిచ్చిన ఎన్టీఆర్ అంటే కైకాల సత్యనారాయణకు ఎంతో గౌరవం. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ సత్యనారాయణ ఇలా అంటారు... ''ప్రవహించే నీటిని కొలవాలంటే ఎంత కష్టమో రామారావు గార్ని గురించి చెప్పటం అంతే కష్టం".చరిత్రలో ఏ ఒక్క గొప్పవారిని చూసిన ,ఏ మహాపురుషుల జీవితం చదివినా మనకు కనిపించేది వారిలో ఏదో ఒకటి, రెండు గొప్పగుణాలు. కాని అందరు మహావ్యక్తులలో ఉన్న గొప్పగుణాలు అన్నీకలిసి రామారావు గారిలోఉన్నాయి. అందుకు తార్కణం ఏ వ్యక్తిలోనైనా ఏదో ఒకటి లోపం విన్నాం.కానీ వీరిలో లోపం ఏదీ మనం వినలేదు... కనలేదు. ఆయనలోని ఒక్కోక్క గుణం, ఒక్కోక్క అంశం గురించి ఒక్కోక్క గ్రంధం వ్రాయవచ్చు. ఒక్క విషయం చెప్పాలంటే సినీజీవితంలో ఆయన అన్న కావటం నాకు గర్వకారణం. నిజజీవితంలో కూడా అన్నగా వుండే భాగ్యం కలగలేదనే భావన భావనగానే నాకు మిగిలిపోయినది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కోక్క యుగంలో ఒక్కోక్కరికి చరిత్ర సృష్టించబడినట్లే ఈ యుగంలో వారిది సువర్ణచరిత్ర.''


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved