* ఒక్క యాప్‌తో జాక్‌పాట్

ఇది నెట్ తరం

ఈ ఫోటోలోని 17 ఏళ్ల కుర్రాడిని ఈ మధ్య మీరు వార్తల్లో చూసి ఉంటారు.. ఇతని పేరు నిక్ డి అలిసియో. మొబైల్ ఫోన్ వల్ల నష్టాలే కాదు డబ్బుపరంగా బోలెడు లాభాలు కూడా ఉన్నాయని నిరూపించిన వాళ్లలో ఇతనూ ఒకడు. ఎందుకంటే ఇతను తయారుచేసిన మొబైల్ అప్లికేషన్ 'సిమ్లి'ని యాహూ- 1.8 కోట్ల పౌండ్లు (148.32 కోట్ల రూపాయలు)కు కొనుగోలు చేసింది. "మొబైల్ అప్లికేషనా.. అని మీరు ఆశ్చర్యపోవచ్చేమో.. కానీ అంత కష్టమేమీ కాదు.. ఇంట్లోనే కూర్చుని తయారుచేసేసా.. కావాలంటే మీరు ట్రై చేయండి'' అని ఈ కుర్రాడు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తున్నాడు.. అసలీ కుర్రాడు ఏం చేశాడు? ఎలా చేశాడనేది తెలుసుకుందాం.

దక్షిణ లండన్‌లోని వింబుల్డన్‌లో నివసించే నిక్‌కు మొదటి నుంచి మొబైల్స్ అంటే చాలా ఇష్టం. తొమ్మిదేళ్ల వయస్సులోనే కంప్యూటర్లను ఉపయోగించటం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో యాపిల్ ఐస్టోర్ ప్రారంభమయింది. మొబైల్స్‌లో ఉపయోగించే కొత్త కొత్త అప్లికేషన్లను అది విడుదల చేయటం మొదలుపెట్టింది. ఆ స్టోర్స్‌లో లభ్యమయ్యే అప్లికేషన్ల సాయంతో నిక్ ప్రోగ్రామింగ్ చేయటం ప్రారంభించాడు.

నిక్ తయారుచేసిన తొలి అప్లికేషన్ పేరు ఫింగర్‌మిల్. ఇంట్లో పరిగెత్తటానికి ట్రెడ్‌మిల్‌ని ఎలా ఉపయోగిస్తామో.. కంప్యూటర్ ముందు పని చేసి అలిసిపోయిన వేళ్లకు ఈ ఫింగర్‌మిల్‌ను అలా ఉపయోగించుకోవచ్చు. యాపిల్ ఫోన్ స్క్రీన్ మీద ఉపయోగించే ఈ అప్లికేషన్‌కు ఇంటర్నెట్‌లో మంచి ఆదరణ లభించింది. కొత్త కొత్త అప్లికేషన్లను తయారుచేస్తూనే నిక్ చదువుకోవటం మొదలుపెట్టాడు.

ఆలోచనకు బీజం
2011లో పరీక్షలకు చదువుకుంటున్నప్పుడు నిక్‌కు ఓ కొత్త ఆలోచన వచ్చింది. దాని పేరు ట్రిమిట్. "వెబ్ పేజీలలో దొరికే సమాచారం ఒకే విధంగా ఉంటుంది. ఈ సమాచారాన్నంతా సంక్షిప్తంగా అందించే అప్లికేషన్ తయారుచేయాలనుకున్నా..'' అంటాడు నిక్. ట్రిమిట్ అనే ఈ అప్లికేషన్‌ను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు రెండు లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ట్రిమిట్‌ను మరింత పరిపుష్టం చేసి మొబైల్‌లో వాడుకొనే విధంగా తయారుచేయాలని నిక్ ప్రయత్నాలు ప్రారంభించాడు. 2012 నవంబర్‌లో సమ్లి అనే పేరు పెట్టి ఆ అప్లికేషన్‌ను విడుదల చేశాడు.

మొబైల్ ఫోన్లలో మెమరీ తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఎక్కువ సమాచారాన్ని తక్కువ స్థలంలో నిక్షిప్తం చేసేలా దీన్ని రూపొందించారు. మెమరీ మీద ఒత్తిడి పడదు కాబట్టి దీనికి మంచి ఆదరణ లభించింది. 2012లో యాపిల్ కంపెనీ నిక్‌కు బెస్ట్ అప్లికేషన్స్ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు వల్ల నిక్‌కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అనేక వెన్చర్ క్యాపిటల్ కంపెనీలు అతని పరిశోధనలకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డాయి. వాటిలో హాంకాంగ్‌కు చెందిన లీ కషింగ్ అనే వాణిజ్యవేత్తకు చెందిన హొరైజాన్ వెంచర్స్ ఒకటి. దీని ద్వారా నిక్‌కు అదనంగా నిధులు అందాయి. అందరూ కలిసి సిమ్లికి మరిన్ని మెరుగులు దిద్దటం మొదలుపెట్టారు. దాంతో ఈ అప్లికేషన్‌పై యాహూ దృష్టి పడింది. దాదాపు ఆరు నెలల సంప్రదింపుల తర్వాత నిక్ ఈ అప్లికేషన్‌ను యాహూకు విక్రయించాడు.

ప్రతిభే వరం
బ్రిటన్ చట్టాల ప్రకారం- ఒక కంపెనీకి డైరక్టర్ అయ్యే వయస్సు నిక్‌కు ఇంకా రాలేదు. దీంతో అతనికి సిమ్లి ద్వారా వచ్చిన సొమ్ము అంతా అతని ఫ్యామిలీ ట్రస్ట్‌కు వెళ్తుంది. ఇన్ని కనిపెట్టినా- చదువే తనకు ముఖ్యమంటాడు నిక్. "నేను ఇంకా పెద్ద చదువులు ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకోవాలి. అందుకే ఇంగ్లాండ్‌లో ఉంటా..'' అంటాడు నిక్.

తన కుమారుడికి వచ్చిన ఖ్యాతీ, సొమ్ములను చూసిన దిగ్భ్రాంతి నుంచి అతని తల్లి డయానా ఇంకా తేరుకోలేదు. "నిక్ భిన్నంగా ఆలోచిస్తాడని తెలుసు. కాని ఇంత ఖ్యాతి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. చిన్నప్పటి నుంచి అతనికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. చాలా శ్రద్ధగా చదివేవాడు. రూమ్‌ను శుభ్రంగా ఉంచుకొనేవాడు. టెక్నాలజీల గురించి నాకు తెలియదు. నేను, మా ఆయన కంప్యూటర్లను కేవలం పని కోసమే వాడతాం..'' అంటుంది డయానా. యాహూతో ఒప్పందం కుదిరింది కాబట్టి ఇక నిక్ లండన్‌లోని యాహూ ఆఫీసుల్లో పనిచేస్తాడని భావిస్తున్నారు.

అలెక్స్ ట్యూ
యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్‌లో చదివే ఈ కుర్రాడు స్టూడెంట్ లోన్‌ను తీర్చటం కోసం ఒక వెబ్‌పేజీని ప్రారంభించాడు. మిలియన్‌డాలర్ హోమ్‌పేజీ అని దానికి పేరు పెట్టాడు. ఈ సైట్‌లో పదిలక్షల పిక్సెల్స్‌ను ఒక డాలర్‌కు కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా లక్షల డాలర్లు సంపాదించిన అలెక్స్ ప్రస్తుతం కామ్.కామ్‌ను ప్రారంభించాడు. మానసిక విశ్రాంతికి అవసరమైన ఎక్సర్‌సైజ్‌లు దీనిలో లభిస్తాయి.

టామ్ హాడ్‌ఫీల్డ్
1994లో 12 ఏళ్ల టామ్‌కు ఇంటర్నెట్ ద్వారా ఫుట్‌బాల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. తన తండ్రికి ఆ ఐడియా చెప్పాడు. ఆయనకు కూడా నచ్చటంతో ఇద్దరూ కలిసి సోకర్‌నెట్ అనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో దీనిని డిస్ని కంపెనీకి చెందిన ఈఎస్‌పీఎన్‌కు 1.5 కోట్ల పౌండ్లకు విక్రయించారు.

క్రిస్టియన్ ఓవెన్స్
2008లో 15 ఏళ్ల ఓవెన్స్‌కు సాఫ్ట్‌వేర్‌లను విక్రయించాలనే ఆలోచన వచ్చింది. వెంటనే మాక్ బండిల్ బాక్స్ అనే ఒక కంపెనీని ప్రారంభించాడు. రకరకాల సాఫ్ట్‌వేర్‌లను సంపాదించి వాటిని యాపిల్ కంప్యూటర్స్‌కు విక్రయించటం మొదలుపెట్టాడు. తొలి ఏడాది ఏడు లక్షల పౌండ్లు సంపాదించాడు. ప్రస్తుతం బ్రాంచ్ఆర్ అనే ఇంటర్నెట్ అడ్వైర్‌టైజింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు.

మార్క్ జూకర్‌బర్గ్
ఫేస్‌బుక్‌ను చూసేవారెవ్వరికీ మార్క్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 2004లో మార్క్‌కు 19 ఏళ్లు. కాలేజీ విద్యార్థుల కోసం ఫేస్‌మాష్ అనే సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసిన మార్క్ ఆ తర్వాత ఫేస్‌బుక్‌ను స్థాపించాడు. 2012లో మార్క్ ఆస్తి విలువ 920 కోట్ల పౌండ్లు.

షాన్ ఫెనింగ్
1999లో 18 ఏళ్ల షాన్ ఫేనింగ్- నేప్‌స్టార్ సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసినప్పుడు అంతర్జాతీయంగా సంచలనం చెలరేగింది. కంప్యూటర్లను అనుసంధానం చేయటం ద్వారా మ్యూజిక్‌ను ఒకరి దగ్గర నుంచి మరొకరు ఉచితంగా పొందటానికి ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. అనేక మ్యూజిక్ కంపెనీలు నేప్‌స్టార్‌పై కేసులు వేయటంతో 2002లో దాన్ని మూసేసారు. కాని అప్పటికే షాన్ కోటీశ్వరుడయిపోయాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved