మామిడి పుట్టింది మనదేశంలోనే..

దేవుడిచ్చిన రకాలు బంగినపల్లి, ఇమాం పసందు

బీహార్‌లో లక్ష మొక్కలు నాటిన అక్బర్‌ చక్రవర్తి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1000 రకాలు

4 వేల ఏళ్ల చరిత్ర: సీనియర్‌ శాస్త్రవేత్త వెల్లడి

‘‘మామిడి భారతదేశంలో పుట్టిందే. దానికి 4 వేల ఏళ్ల చరిత్ర ఉంది. మొదట్లో మునులూ, రాజులు విత్తనాలు నాటి చెట్లు పెంచారు. అయితే, వాటికి పూర్తిగా తల్లి లక్షణాలు ఉండేవి కావు. ముస్లిం సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత అక్బర్‌ చక్రవర్తి బిహార్‌లో లక్ష మామిడి మొక్కలు నాటాడు. తల్లి లక్షణాలు వందకు వంద శాతం తేవడం కోసం అంటుకట్టడం అక్కడే మొదలైంది’’ అని రాష్ట్ర ఉద్యానవనశాఖ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌ్‌సలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో బుధవారం.. కాల్షియం రహిత మామిడిపండ్ల ఉత్పత్తి, మామిడి దిగుబడి, కోతకు ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి జరిగిన సాంకేతిక సదస్సులో ఆయన మాట్లాడారు. ఇవాళ సుమారు 100 దేశాలలో 1000 రకాల మామిళ్లు ఉన్నాయని.. చిత్తూరు నుంచి ఆరు రకాలు వెళ్లాయని చెప్పారు. ‘‘మనకు బంగినపల్లి, ఇమాం పసందు దేవుడిచ్చిన రకాలు’’ అన్నారు. మామిడి పుట్టింది మనదేశంలోనే అయినప్పటికీ.. ఎకరానికి దిగుబడి విదేశాలలోనే అధికమని చెప్పారు. విదేశాల్లో ఎకరానికి 12.5 నుంచి 13 టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో 3 నుంచి 4 టన్నులకు మించట్లేదన్నారు. శాఖీయ పెరుగుదల నియంత్రణ పాటిస్తే 8 నుంచి 10 టన్నుల దిగుబడి సాధించవచ్చన్నారు. తడిపెట్టడం, ఎండు కొమ్మలు, అనవసర కొమ్మలు నరికేయడం, ఇంటిగ్రేటెడ్‌ న్యూట్రిషన్‌ యాజమాన్య పద్ధతులు పాటించడం, సేంద్రియ ఎరువులు వేయడం వంటి పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చని ఆయన వివరించారు. కాల్షియం కార్బైడ్‌ కెమికల్‌ ద్వారా కాయలను మాగబెట్టడంవల్ల అనేక రోగాలు వస్తాయని హెచ్చరించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved