ఈ పిల్లాడు అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో

నైజీరియాకు చెందిన ఈ రెండేళ్ల పిల్లాడి రెండు నెలల క్రితం ఫొటోకు, ఇప్పటి ఫొటోకు ఎంత తేడానో! మంత్రగత్తె పిల్లాడంటూ తల్లిదండ్రులు వదిలేయగా, వీధుల్లో చెత్త కుప్పల వద్ద ఎనిమిది నెలలుగా ఎంగిలి మెతుకులు తింటూ వీధుల్లో తిరుగుతూ చిక్కి శల్యమైన బాలుడి నాటి ఫొటోకు, నేడు సంపూర్ణ ఆరోగ్యవంతుడై తోటి పిల్లలతో ఆడుకుంటున్న బాలుడి నేటి ఫొటోకు అసలు పోలికే లేదు. రెండు నెలల క్రితం అంటే, జనవరి 31వ తేదీన ఓ నైజీరియా వీధిలో కనిపించిన ఈ పిల్లాడిని డెన్మార్క్ కు చెందిన సామాజిక కార్యకర్త అంజా రింగ్రెన్ లోవెన్ చేరదీశారు. బాలుడికి ‘హోప్’ అని పేరుపెట్టి తన శరణాలయంలో చేర్చుకున్నారు.

ఈ రెండు నెలల్లోనే బాలుడిలో వచ్చిన మార్పును తెలియజేసేందుకు లోవెన్ నాటి ఫొటోలతో పాటు బాలుడి నేటి ఫోటోలను శుక్రవారం నాడు ‘ఫేస్‌బుక్’లో పోస్ట్ చేశారు. రెండు నెలల క్రితం తాను తీసిన బాలుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ప్రపంచం స్పందించింది. బాలుడి వైద్య ఖర్చుల కోసం ఆమె అప్పీల్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా 68 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయి. ‘ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్’ను ఆఫ్రికాలో నిర్వహిస్తున్న లోవెన్ అనాథ ఆఫ్రికన్ పిల్లలను, మూఢనమ్మకాల కారణంగా వదిలేసిన పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు.

తాను చేరదీసినప్పుడు పూర్తి అనారోగ్యంగా ఉన్న ‘హోప్’ను నెల రోజులపాటు ఆస్పత్రిలో ఉంచి ప్రతి రోజు కొత్త రక్తాన్ని ఎక్కించారు. కడుపులో పెరిగిన పురుగులను తొలగించారు. హోప్ జీవితానికి నిజమైన హోప్‌ను కల్పించారు. లోవెన్ చేస్తున్నా సామాజిక కృషికి ఆమె భర్త డేవిడ్ ఎమ్యాన్యువల్ అండగా ఉంటూ తనవంతు సామాజిక సేవ చేస్తున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved