నేటి నుంచి హెల్మెట్ తప్పనిసర

హెల్మెట్ ధరించకున్నా, సీటు బెల్ట్ పెట్టకపోయినా విధించే జరిమానా రూ. 2000

ఒంగోలు క్రైం : బైకులు నడిపే వారంతా శనివారం నుంచి తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికీ మినహాయింపు లేదని, బైకులు నడిపే వారంతా (పోలీసులు, విలేకరులతో సహా) హెల్మెట్ ధరించాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్లు లేక చాలామంది ప్రాణాలు పోగుట్టుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. హెల్మెట్ ఉంటే గాయాలతో బయటపడవచ్చు. ప్రాణాలు కాపాడుకోవచ్చు. భారం అనుకోకుండా తప్పనిసరిగా హెల్మెట్ కొనుగోలు చేసుకుంటే సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. వాస్తవానికి జూన్ ఒకటో తేదీ నుంచి హెల్మెట్ ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హెల్మెట్లు చాలినన్ని అందుబాటులో లేకపోవటంతో పాటు నాణ్యమైనవి లేవన్న కారణంగా ప్రభుత్వం నెల గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

భారం అనుకోవద్దు : జి.శ్రీనివాసరావు, డీఎస్పీ, ఒంగోలు

హెల్మెట్ల కొనుగోలు భారం అనుకోవద్దు. అసౌకర్యం అంతకన్నా అనుకోవద్దు. ట్రాఫిక్ రోజు రోజుకూ పెరిగేకొద్దీ ప్రమాదాలూ అంతే స్థాయిలో జరుగుతున్నాయి. రోడ్డు భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హెల్మెట్లు ధరిస్తే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. భారం, అసౌకర్యం అనుకోకుండా ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్లు కొనుగోలు చేసి వాటిని పెట్టుకునే వాహనాలు నడపాలి. ఇంటి వద్ద మన కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని గుర్తించుకోవాలి. 

కారులో డ్రైవర్‌తో సహా అంతా సీటు బెల్ట్ ధరించాల్సిందే

చీమకుర్తి : ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్లు ఎలా ధరిస్తున్నారో కారులో డ్రైవర్‌తో సహా అంతా సీటు బెల్ట్‌లు ధరించాల్సిందేనని ఎస్సై సుబ్బరాజు తెలిపారు. హెల్మెట్ లేకున్నా, సీటు బెల్ట్ ధరించకున్నా ఒక్కొక్కరికి రూ.2 వేల అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. సామాన్య ప్రజలతో పాటు పోలీసులు కూడా తప్పనిసరిగా ెహ ల్మెట్లు ధరించాలన్నారు.

మైక్ ద్వారా ప్రచారం

ఒంగోలు క్రైం : మైక్ ద్వారా ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం అవగాహన కల్పించారు. మొదటి నుంచి హెల్మెట్ వాడకంపై చెబుతూనే ఉన్నామని, ప్రజలు అర్థం చేసుకొని పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ డీఎస్పీ జె.రాంబాబు కోరారు.

జాగ్రత్తలివిగో..

►స్టాప్ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండే హెల్మెట్ చూసుకోవాలి

►ధరించినప్పుడు స్టాప్ తీసుకునేందుకు, పెట్టుకునేందుకు మన వేళ్లు లోపలికి వెళ్లే విధంగా హెల్మెట్ ఉండాలి.

►ధరించినప్పుడు బిగుతుగా ఉండకూడదు. లోపల తల అటూ, ఇటూ తిరిగే విధంగా చూసుకోవాలి

►బుగ్గలు ఒత్తిడికి గురికాకుండా ఉండాలి.

►వెనక్కు, ముందుకు వంగినప్పుడు పడిపోకూడదు, ఊడకూడదు.

హెల్మెట్ ఇలా ఉండాలి

►హెల్మెట్లలో చాలా రకాలున్నాయి. నాణ్యతతో పాటు తేలికగా ఉండే వాటిని ఎంచుకోవాలి.

►తలకు సరిపడే విధంగా హెల్మెట్ ఉండేలా కొలతలు చూసుకొవాలి.

►మీరు ఎంచుకున్న హెల్మెట్ తల, మెడ, గడ్డం కింది భాగం వరకూ రక్షణ ఇవ్వాలి.

►సగం ఉన్నవి, చిన్నవిగా ఉండేవి ధరించకూడదు.

►తలకు హెల్మెట్ ఉన్నప్పుడు వెనుక వచ్చే వాహనాల హారన్ వినపడేలా ఉండాలి.

►డాట్ (డీఓటీ) డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ స్టిక్కర్స్ ఉన్న హెల్మెట్‌లనే ధరించాలి.

►హెల్మెట్ ధరించి వాహనం నడిపేటప్పుడు వెనుక వచ్చే వాహనాలు కనపడే విధంగా సైడు అద్దాలు అమర్చుకోవాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved