కూలీ కొడుకు కోటీశ్వరుడయ్యాడు!

నాథూ సింగ్‌కు రూ. 3.2 కోట్ల ధర ఈ సారి వేలంలో యువరాజ్‌కు ఎంత ధర పలికింది..? పీటర్సన్‌ను ఎవరు దక్కించుకున్నారు..? వాట్సన్‌కు ఏ మాత్రం దక్కింది..? అనే దానిపైనే చర్చ సాగుతోంది..! కానీ.. ఈ వేలం ద్వారానే ఓ అనామక ఆటగాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..! అతడే నాథూ సింగ్‌.. జైపూర్‌కు చెదిన ఈ 20 ఏళ్ల పేసర్‌ను ముంబై ఇండియన్స్‌ రూ. 3.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంతకీ ఎవరీ నాథూ..? అంటే జైపూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే భరత సింగ్‌ కొడుకు..! దేశవాళీల్లో అతనిది 11 టీ20 మ్యాచ్‌ల అనుభవమే..! ఐపీఎల్‌ గడపతొక్కడం ఇదే తొలిసారి. అయితేనేం తనలోని ప్రతిభతో భారత బ్యాటింగ్‌ దిగ్గజం రాహుల్‌ ద్రావిడ్‌ మనసు దోచేశాడు. భారత-ఎకు కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రావిడ్‌ అతనిలో ‘ఫైర్‌’ ఉందని గుర్తించాడు. ప్రత్యర్థులను గడగడలాడించిన షోయబ్‌ అక్తర్‌, బ్రెట్‌ లీ మాదిరిగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులేయడం నాథూ ప్రత్యేకత. తనకు ఇంతటి ధర పలకడంపై నాథూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘మా కుటుంబ ఆర్థిక కష్టాలు తీరినట్టే. ఈ డబ్బుతో ముందుగానా తల్లిదండ్రులకు ఓ పెద్ద ఇల్లు కట్టిస్తాన’ని భావోద్వేగంతో చెప్పాడు.

కష్టానికి ప్రతిఫలం: నాథూ తండ్రి భరత్ సింగ్‌

ఐపీఎల్‌ వేలంలో నాథూకి రూ. 3.2 కోట్ల ధర దక్కడంపై అతని తండ్రి భరత సింగ్‌ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో ప్యాకెట్లు లోడింగ్‌ చేస్తూ బిజీగా ఉన్న భరత సింగ్‌కు ఎవరి ద్వారానో ఆ విషయం తెలిసింది. దీనిపై అతను స్పందిస్తూ.. ‘నాథూ సాధించిన వాటికి గర్వపడుతున్నాను. అతని కష్టానికి తగిన ప్రతిఫలమిద’ని చెప్పాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved