చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలుండవ్‌: మోదీ

‘‘కిందిస్థాయి ఉద్యోగాల కు ఇంటర్వ్యూలు అవసరమా?’’ అని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఇంటర్వ్యూ తొలగింపు దిశగా వేగంగా చర్యలు చేపట్టారు. ఆదివారం నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘దిగువ శ్రేణి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరమా? ఎందుకంటే.. ఇంటర్వ్యూ కోసమని తమ పిల్లలకు ఫోన్‌ కాల్‌రాగానే..ఎలాగైనా అందులో విజయం సాధించాలని వారి తల్లిదండ్రులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పేద ప్రజలు.. సిఫారసు లేఖల కోసం పరిగెడుతున్నారు. చివరకు ఇదంతా అవినీతిదిశగా సాగుతోంది. అందువల్ల అవినీతిని ప్రోత్సహించే ఇంటర్య్యూల అంశంపై 15 రోజుల్లోనే స్పందించాం. త్వరలోనే ఇంటర్వ్యూలను తొలగించేలా చర్యలు చేపట్టాం. ’’ అని వివరించారు. ఇదిలా ఉండగా.. సూఫీ సందేశమే ఇస్లాం మతంలోని అసలు రూపాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. ‘‘నేను ఇటీవల కొంతమంది సూఫీ గురువులు, తత్వ వేత్తలతో మాట్లాడాను. సూఫీ మతంలోని ఉదారత నన్ను కట్టిపడేశాయి’’ అని పేర్కొన్నారు. సూఫీ మతంలోని ఉదారత, ప్రేమ.. ఇస్లాంకు, మానవజాతికి మేలు చేకూరుస్తాయన్నారు. మరోవైపు.. ఆల్‌ ఇండియా రేడియో డిజిటల్‌ విధానంలో రూపొందించిన ‘రామచరిత్‌మానస్‌’ను సోమవారం మోదీ ఆవిష్కరించనున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved