నువ్వులతో నవ్వుల జీవితం పొందొచ్చు!!

సంక్రాంతి పండుగకి మనం చేసుకునే చక్కిలాలు, చక్కలు లేదా అరిశెలు, నువ్వుల ఉండలు వీటన్నింటిలో ఉండే ముఖ్యమైన పదార్ధం నువ్వులు. పిల్లలకి పోసే భోగి పళ్లలో కూడా నువ్వులు కలుపుతారు కొందరు. సంక్రాంతికి నువ్వులను ఎందుకు ఇంత ఎక్కువగా వాడతారు?? అన్న ప్రశ్న అందరికీ రావచ్చు.

నువ్వులు వేడి గుణాన్నీ, ఉష్ణశక్తినీ కలిగి ఉండడం వల్ల చలి కాలం, వర్షాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెను గాయాలకు పూతగా రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మొలలు (పైల్స్‌) వ్యాధిలో, అతిసార వ్యాధిలో నువ్వులను ఉపయోగిస్తారు. ఆడవారి ఋతుసంబంధ విషయాలలో ఇది బాగా పని చేస్తుంది.

నువ్వు గింజలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు లభిస్తాయి. నల్ల నువ్వులలో మాత్రం ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. నువ్వుల నూనె కొవ్వును కరిగిస్తుంది. బాలింతల్లో చనుబాలు పెరగడానికి నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అన్నం బాగా జీర్ణం కావడానికి కూడా నువ్వులు ఉపయోగపడతాయి. కేశ వృద్ధికి నువ్వుల నూనె పని చేస్తుంది. నువ్వు పువ్వులను నెయ్యి, తేనెలను కలిపి తల మీద లేపనంగా పెడితే బట్ట తలపై కూడా జుట్టు బాగా వస్తుంది. రక్త విరేచనాలకు నువ్వులను మేకపాలతో కలిపి సేవిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

బాగా మరుగుతున్న నీటిలో నువ్వుల ఆకులను వేసి, దాని ద్వారా వచ్చే ఆవిరిని పీలిస్తే అతిసారం తగ్గుతుంది. చర్మ సంబంధమైన వ్యాధులకూ, శరీరంపై గాయాలకూ నువ్వులను పూతగా పెడితే మంచి ఫలితం వస్తుంది. దంతాలకు కూడా నువ్వులు బాగా మేలు చేస్తాయి ఎందువల్ల అంటే నువ్వులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

నువ్వుల నూనెతో ప్రతి రోజూ శరీరానికి మర్దన చేస్తే చర్మానికి నిగారింపే కాక చిన్నతనంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను కూడా అరి కట్టవచ్చు. అలాగే, చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవు తాయి. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు మాలిష్‌ చేయడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటు మేధాశక్తి ఎక్కువవుతుంది. పిల్లలు పక్క తడపకుండా ఉండడానికి కూడా నువ్వుల నూనె పని చేస్తుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved