ఒక్క ఫోన్‌ కాల్‌తో రైలు టికెట్‌ రద్దు

రైలు ప్రయాణికులకు శుభవార్త. అనివార్య కారణాలతో రద్దు చేసుకున్న ప్రయాణానికి సంబంధించిన రిజర్వేషన్‌ టికెట్లను కాన్సిల్‌ చేసుకోవడం ఇకపై సులభతరం కానుంది. కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌తో టికెట్‌ను రద్దు చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ ఏప్రిల్‌ రెండో వారం నుంచి అందుబాటులోకి తెస్తోంది. దీని ప్రకారం నంబర్‌ 139కి ఫోన్‌ చేసి, రద్దు చేసుకున్న ప్రయాణానికి సంబంధించిన టికెట్‌ వివరాలను వెల్లడించాలి. దీంతో టికెట్‌ రద్దయిన సమాచారంతోపాటు ప్రయాణికుని ఫోన్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ అందుతుంది.

అదేరోజు సమీప రిజర్వేషన్‌ కౌంటర్‌కు వెళ్లి ఈ పాస్‌వర్డ్‌ను చెప్పి, తమకు రావాల్సిన టికెట్‌ రద్దు రుసుమును పొందవచ్చని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మార్చిన టికెట్‌ రద్దు నిబంధనల నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ క్రమంలో నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు వివరించారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న టికెట్లను.. ఇకపై ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వెబ్‌సైట్‌లోనే రద్దు చేసుకోవచ్చని తెలిపారు. నంబర్‌ 139 సౌలభ్యం కేవలం కౌంటర్ల వద్ద టికెట్లను రిజర్వేషన్‌ చేసుకున్న వారికేనని వివరించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved