ఆన్ లైన్ లో ల్యాప్ టాప్ ఆర్డర్ చేస్తే.. ఏమి వచ్చాయో తెలుసా?

ఆన్ లైన్ షాపింగ్ లో మరో భారీ మోసం బయటకు వచ్చింది. ఇంటినుంచే షాపింగ్ చేస్తున్న వారిని నకిలీ కంపెనీలు మోసం చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ల్యాప్ టాప్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా రాళ్లు, చపాతీ ముక్కలు రావడం చూసి షాక్ తిన్నాడు. ఆ వివరాలలోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పోణంగి రోడ్డులో ఉంటున్న కొలుసు తారకరామ్ అనే బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఈ నెల 12న పేటీఎంలో లెనోవా కంపెనీ ల్యాప్ టాప్ ను ఆర్డర్ చేసాడు. ఇందుకు రూ.31,940లను అప్పటికప్పుడే ఆన్ లైన్ లో చెల్లించాడు కుడా.

అంతవరకు బాగానే ఉంది. అయితే.. ఆరు రోజుల తరువాత బ్లూడాట్ కొరియర్ ద్వారా విద్యార్థి ఇంటికి పార్శిల్ వచ్చింది. ల్యాప్ టాప్ అనే భావించి.. తన కొత్త ల్యాప్ టాప్ కోసం ఆతృతతో తెరచి చూడగా రెండు రాళ్లు, కొన్ని చపాతీ ముక్కలు కనిపించాయి. దానితో అతను ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడు. వెంటనే ఆ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఈ విషయాన్ని మీడియాకు తెలిపాడు. తనకు న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved