పనసపొట్టు కూరకి ఎందుకంత డిమాండ్..

పనసపొట్టు కూరకి ఎందుకంత డిమాండ్..పైగా ఆవపెట్టిన పనసపొట్టు కూరైతే మరీను..ఎందుకు.. భరణిగారి “ మిధునం ” సినిమాలో ప్రత్యేకం గా పనసపొట్టు కూర గురించి బాలు అద్భుతం గా వర్ణించినట్టూ అంటే..

ఒక్క పనసకాయ మాత్రమే అటు పండితే మధురమయిన పనసతొనలనిస్తుంది..ఇటు పచ్చిగా ఉన్నప్పుడు పనస కాయ మసాలా కూర,పనసపొట్టు కూర,పనసగింజలకూర,పనసకాయ బిర్యానీ..ఇలా ఎలా చేసుకున్నా అద్భుతమయిన రుచిని ఇస్తుందికాబట్టి.

సరే మరి పనసకాయ ఆవపెట్టినకూర ప్రత్యేకం ఏంటీ అంటే..

రైస్ తో చేసే పులిహార ఎంత టేస్టీగా ఉంటుందో పనసపొట్టుతో చేసే ఈకూర అంత టేస్టీగా ఉంటుంది..

అమ్మో పులిహార అంటే చాలా టైం పడుతుందికదా ఇదికూడా అంతే టైం పడుతుందా అంటే,అన్నీ… రడీ చేసుకుంటే టైం అనేది సమస్యేకాదు.

ఒక పావుకిలో పనసపొట్టు తెచ్చుకుని మందంగా ఉండే ఒక గిన్నెలో వేసి కొద్దిగా పసుపువేసి ఉడికించాలి..అదేంటీ కుక్కర్లొచ్చాకా ఇంకా విడిగా ఉడికించడం ఎందుకూ అని డౌట్ రావచ్చు.ఏంలేదు కుక్కర్ లో అయితే మరి మెత్తగా ఉడికిపోతుంది,అప్పుడు పొట్టు విడివిడిగారాదు.

ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో 50 గ్రాముల చింతపండు నానబెట్టుకుని చిక్కని పులుసు తీసి పక్కనపెట్టుకుంటే ఇంకా ఈజీగా కర్రీ చేసేసుకోవచ్చు.6 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని,ఒక చిన్న అల్లం ముక్క ని చిన్నముక్కలుగా కట్ చేసుకుని మూడు ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసుకోవాలి.

ఆల్రెడీ ఉడికిన పనసపొట్టుని చిల్లులున్న బౌల్ లో వేసి నీటినంతా తీసేయ్యాలి. ఇప్పుడు ఒక బాణలి(బాండీ) ని స్టవ్ మీద పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాకా కొద్దిగా ఇంగువ(స్మెల్ ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే వేయ్యాలి.. వెయ్యకపోయినంతమాత్రాన పనసపొట్టు ఏమీ ఫీలవదు..అదే టేస్ట్ ఏమీ మారదు)..ఒక స్పూన్ పచ్చిసెనగపప్పు,ఒకస్పూన్ మినప్పప్పు,ఒకస్పూన్ ఆవాలు,ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగుతుండగా మూడు స్పూన్స్ వేరుశనగ గుళ్ళు కూడా వెయ్యాలి,తర్వాత ఎండుమిర్చి ముక్కలుకూడా వెయ్యాలి..ఇలా వేగుతుంటేనే ముందర కట్ చేసిపెట్టుకున పచ్చిమిర్చి,అల్లం తోపాటు కరివేపాకు కూడా వేసి..అఖరున చింతపండు పులుసు కూడా వేసి..ఒక రెండునిమిషాలుఉడుకుతుండగా ఈలోపల పనసపొట్టు కూర స్టవ్ మీద ఉండగానే మూడు స్పూన్ల ఆవాలు,కొద్దిగా(చిటికెడు) సాల్ట్ ఒక ఎండుమిర్చి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు కూడా పోసి పేస్ట్ చేసుకోవాలి..ఇప్పుడు స్టవ్ మీద కూర ని కట్టేసి ఈ ఆవాలు పేస్ట్ ఆ పనసపొట్టుకూర లో వేసి మొత్తం కూర అంతా కలిసేటట్టు కలపాలి..ఆంతే పనసపొట్టుకూర రడీ. అంతా పులిహార ప్రిపరేషన్ కి దగ్గరగా ఉంది కదా.టేస్ట్ కూడా అంతే బావుంటుంది.ముందరే ఆవాలు పేస్ట్ చేసుకోవచ్చుగా అని అడగచ్చు,ముందరే చేసుకున్నా స్టవ్ మీద కూర ఉడుకుతుండగా వేసినా చేదు వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు,వీలయినప్పుడు పనసపొట్టుకూర చేసుకుని తింటే ఆ టేస్ట్ మర్చిపోవడం కష్టం..ట్రై చెయ్యండి మరి..

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved