కాబోయే అమ్మా.. కాస్త జాగ్రత్త!

ఒకప్పుడు ఐదారుగురు పిల్లల్ని కనేవాళ్లు. గర్భం నుంచి కాన్పు వరకూ..సీమంతం నుంచి బాలసారె వరకూ.. ప్రతిదీ ప్రకృతి సహజంగా.. ఒక పండగలా.. హాయిగా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా లేదు. గర్భంతో పాటేమధుమేహం మొదలవుతోంది. ఆ వెంటే హైబీపీ బయల్దేరుతోంది. సరిగా పట్టించుకోకపోతే.. గర్భవాతం, గుర్రపువాతం.. తల్లీబిడ్డలిద్దరికీ నానాదుష్ప్రభావాలూ.. సమస్యలూ తలెత్తుతున్నాయి.ఎందుకిలా????దీనంతటికీ మూలం మన ఆధునిక జీవనశైలిలోనూ, మారుతున్న మన ఆహారం, అలవాట్లలోనే ఉందంటోంది నేటి పరిశోధనా రంగం. మన ఆహారం మారిపోయింది, పర్యావరణం మారిపోయింది, ఒత్తిళ్లు పెరిగిపోయాయి.

ఫలితమే ఈ గర్భ సమస్యలన్నీ! అందుకే వీటన్నింటినీ వదిలించుకుని... గర్భిణులంతా చక్కటి ఆహారాన్నీ, మన సంప్రదాయ జీవనశైలినీ అలవరచుకోవటం ఉత్తమం అంటున్నారు ప్రముఖ పరిశోధకులు డా|| శ్రీనివాస్‌ నాగళ్ల. అమెరికాలోని ఆరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీలో పిల్లల విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన వైద్య పరిశోధనా రంగంలో ఎంతో కృషి చేశారు. గర్భిణుల ఉమ్మనీటిలో ఇన్ఫెక్షన్లను గుర్తించేందుకు మార్కర్లను కనుగొనటం దగ్గరి నుంచీ లాలాజలం సాయంతోనే మధుమేహాన్ని నిర్ధారించే వరకూ... ఆయన ఎన్నో పరిశోధనలు సాగించారు. ముఖ్యంగాగర్భిణుల్లో ఎవరికి హైబీపీ వచ్చే అవకాశం ఉంటుంది? ఎవరిలో అది మరింత తీవ్రతరమై గర్భవాతం వంటివి తెచ్చిపెడుతుందన్నది ముందే గుర్తించేందుకు వీలైన తేలికపాటి పరీక్షలనూ రూపొందించారు ఆయన. చాలా తేలికగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యేఈ పరీక్షలను గేట్స్‌ ఫౌండేషన్‌ సాయంతో త్వరలో మన దేశంలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘గర్భిణుల్లో హైబీపీ’ సమస్య గురించి ‘సుఖీభవ’ ఆయనతో ముచ్చటించింది. వివరాలు.. ఈ వారం ప్రత్యేకం!గర్భిణుల్లో హైబీపీ... చాలా పెద్ద సమస్య. ఇప్పుడు గణాంకాలు చూస్తే..గర్భిణుల్లో దాదాపు 5-7% మందికి హైబీపీ వస్తోంది. మన దేశంలో ఏటా2.7 కోట్ల మంది గర్భం దాలుస్తున్నారు.

అంటే ఎంతలేదన్నా 13.5 లక్షల మంది గర్భిణీ హైబీపీగానీ, అది బాగా ముదిరిపోవటం వల్ల వచ్చే గర్భవాతం బారినగానీ పడుతున్నారు. అంటే ఇదెంత పెద్ద సమస్యో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు గర్భిణులకు అల్ట్రాసౌండ్‌ నుంచి రకరకాల రక్తపరీక్షల వరకూ చాలా పరీక్షలు చేస్తున్నాం. కానీ వీటిలో అధికభాగం పిల్లల్లో అవకరాలు,పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించేందుకు ఉద్దేశించినవే. పుట్టుక లోపాలు చాలా తీవ్రంగా కనబడుతాయి, చాలా దిగ్భ్రాంతికరంగా కూడా ఉంటాయి.అందుకే వైద్యపరిశోధనా రంగం వీటి మీదే విస్తృతంగా ప్రయోగాలు చేసి.. వీటిని ముందుగానే గుర్తించటానికి సమర్థవంతమైన పరీక్షలు అభివృద్ధి చేసింది. దీంతో పుట్టుక లోపాలను మనం ముందుగానే, తేలికగా గుర్తించగలుగుతున్నాం. కానీ నిజానికి ఈ అవకరాలు వచ్చేది పదివేల మందిలో ఒకరికి! అదే గర్భిణుల్లో హైబీపీ సమస్యను చూడండి... దాదాపు ప్రతి 10-15 మందిలో ఒకరు దీని బారినపడుతున్నారు. కాబట్టి పదివేల మంది పిల్లల్లో ఒకరికి వచ్చే లోపాలతో పోలిస్తే... హైబీపీ సమస్య ఎంతో ఎక్కువ కదా! పైగా హైబీపీ వల్ల వచ్చే సమస్యలూ తీవ్రమే. లోపాలు పిల్లల్లోనే వస్తాయి, తల్లికేమీ కాదు. కానీ హైబీపీ వల్ల తల్లీబిడ్డలిద్దరూ ప్రభావితమవుతారు. అందుకే ఇప్పుడు గర్భిణుల్లో హైబీపీ పట్ల వైద్య పరిశోధనా రంగం కూడా చాలా లోతుగా పరిశోధనలు చేస్తోంది. హైబీపీ, అది ముదిరితే వచ్చే ‘గర్భవాతం’ (ప్రీ ఎక్లాంప్సియా).. రెండూ చాలా తీవ్రమైన సమస్యలు. గర్భిణి మరణాల్లో 10-25% వీటి కారణంగానే సంభవిస్తున్నాయి. ఇలా మనం ఎంతోమంది తల్లులను కోల్పోతున్నాం. అందుకే ఇప్పుడీ సమస్యను ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్నారు

.*అసలు గర్భిణికి హైబీపీ ఎందుకొస్తుంది?ఒక్క ముక్కలో చెప్పాలంటే మామూలుగా అందరికీ హైబీపీ ఎందుకు వస్తుందో..గర్భిణికీ అందుకే వస్తుంది. కాకపోతే గర్భిణీ శరీరంలో.. కడుపులో బిడ్డ పెరుగుతున్న సమయంలో జీవక్రియల పరంగా ఎన్నో భారీ మార్పులు సంభవిస్తుంటాయి. ఒక బిడ్డ పెరగటమంటే చిన్న విషయం కాదు. ఆమె శరీరంలో అప్పుడు.. దాదాపు 10 లక్షల రక్తనాళాలు తయారవుతుంటాయి. అదీ చాలా వేగంగా, చాలా తక్కువ సమయంలో పెరగటం.. దాని ద్వారా రక్తం ప్రవహిస్తూ..బిడ్డకు అందించాల్సినవన్నీ అందిస్తుండటం... ఇదో బృహత్‌ ప్రక్రియ! ఈవేగానికీ, మార్పులకూ దాదాపు 90% తల్లులు తేలికగానే అలవాటుపడతారు. కానీ ఆ మార్పులను తట్టుకోలేని మిగిలిన 10-15% తల్లులు గర్భణీ మధుమేహం, లేదా గర్భిణీ హైబీపీ వంటి సమస్యల్లో చిక్కుకుంటారు. చాలామంది పరిశోధకులు బహుశా మాయలో రక్తనాళాలు సరిగా ఏర్పడటం లేదేమో, ఏర్పడినా దానిలో రక్తప్రవాహం సరిగా లేదేమో.. దానివల్లే తల్లిలో ఈ సమస్యలు వస్తున్నాయని భావిస్తున్నారు. ఎందుకంటేఈ లక్షలాది రక్తనాళాలు తయారవుతున్నది (యాంజియోజెనిసిస్‌) తల్లిలోనేకదా. ఈ రక్తనాళాలు తయారయ్యేందుకు అవసరమైన హార్మోన్ల వంటివన్నీ ఆమె శరీరంలోని ఇతర రక్తనాళాలనూ ప్రభావితం చేస్తాయి. అందుకే తల్లిలో హైబీపీ వస్తోందని భావిస్తున్నారు. మా పరిశోధనల్లో హైబీపీ రావటానికీ, అది ముదిరి గర్భవాతం వంటి తీవ్ర సమస్యలు పెరగటానికీ... ‘ఇన్‌ఫ్లమేషన్‌’ ముఖ్య పాత్ర పోషిస్తోందని గుర్తించటం జరిగింది.*గర్భిణికి హైబీపీ ఎప్పుడు రావచ్చు?పెద్దల్లో చాలామందికి హైబీపీ ఉన్నా వెంటనే ఏమీ కాదు కదా, మరి గర్భిణికి హైబీపీ వస్తే మాత్రం ఏమవుతుంది? అదీ కేవలం 9 నెలలే కదా!ఆ తర్వాత ఎలాగో పోతుంది అనుకోవచ్చు. సాధారణంగా గర్భిణుల్లో హైబీపీ 4వ నెల తర్వాత మొదలవ్వచ్చు. వాస్తవానికి సమస్య అప్పుడు బయటపడినా.. దానికి మూలాలు తొలి వారాల్లోనే, అదీ తొలి 6 వారాల్లోనే పడుతుండొచ్చు. ఎందుకంటే ఈ కొత్త రక్తనాళాలు ఏర్పడటం, బిడ్డకు అవయవాలన్నీ తయారవ్వటం వంటివన్నీ మొదటి 6 వారాల్లోనే జరిగిపోతాయి. కాబట్టి హైబీపీకీ, దాన్ని ప్రేరేపించే కారకాలకు బీజాలు ఈ దశలోనే పడతాయి. కాకపోతే మనం కొలిచి, గుర్తించగలిగే స్థాయికి రావటానికి దానికి కొద్ది నెలల సమయం పట్టొచ్చు.రక్తపోటు 120/80 కంటే ఎంత ఎక్కువున్నా సమస్యే. గర్భిణికి 140/90 గానీ, అంతకంటే ఎంత ఎక్కువగా గానీ బీపీ ఉంటే దాన్ని ‘గర్భిణీ హైబీపీ’గా గుర్తించాల్సి ఉంటుంది. ఇది క్రమేపీ పెరిగిపోతుండటం, దీనితో పాటే మూత్రంలో సుద్ద (ప్రోటీన్‌) పోతుండటం.. ఈ రెండూ సంభవిస్తే దాన్ని గర్భవాతంగా (ప్రీ ఎక్లాంప్సియా) గుర్తిస్తారు. హైబీపీ ఒకస్థాయికి చేరుకుందంటే వీరిలో రక్తప్రసారంలో తేడాలు వచ్చి.. దాని కారణంగా కిడ్నీల పనితీరు మారి.. మూత్రంలో ప్రోటీన్‌ పోవటం మొదలవుతుంది. ఇలా కిడ్నీలు ఎందుకు ప్రభావితమవుతున్నాయన్నదీ కీలకమే. దీనికి దారి తీస్తున్న కారణాలేమిటన్న దానిపై మేం పరిశోధనలు జరిపాం.

ఇప్పటికే హైబీపీ ఉన్న గర్భిణులు కొందరినీ, తొలి వారాల్లో ఉన్న గర్భిణులను కొందరినీ తీసుకుని.. వారిలో ఏమేం తేడాలు కనబడుతున్నాయో గుర్తించేందుకు వీరి రక్తంలోని ప్రోటీన్లను సమగ్రంగా విశ్లేషించాం. ఇప్పటికే హైబీపీ, మూత్రంలో సుద్దపోవటం వంటివి ఉన్న గర్భిణుల్లో కొత్త రక్తనాళాలకు సంబంధించిన మార్కర్లన్నీ (ఎండోథీలియల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ రెసెప్టర్‌ వంటివన్నీ) పెరిగి కనబడుతున్నాయి. కానీ మొదటి వారాల్లో ఇవి అంతగా కనబడటం లేదు.ఈ నేపథ్యంలో మా పరిశోధనల్లో గుర్తించిందేమంటే- గర్భిణీ హైబీపీకీ, గర్భవాతానికీ మూలం ‘వాపు తత్వం’ (ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్‌) లో ఉందనీ, అదే ఈ సమస్యలకు మూలమని గ్రహించాం. మామూలు వారిలో హైబీపీకి కారణమవుతున్న అంశాలే.. వీరిలోనూ మొదటి మూడు నెలల్లో కనబడుతున్నాయి! 3-6 నెలల మధ్య గర్భవాతం వచ్చిన తల్లులందరికీ కూడా తొలివారాల్లో ఈ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వాపు సంబంధ హార్మోన్లన్నీ కూడా హైబీపీకి సంబంధించినవే. తల్లుల్లో ఈ హార్మోన్లు చాలా పైస్థాయిలో ఉంటున్నాయి.. ఇవే గర్భవాతం ఆరంభమయ్యేలా చేస్తున్నాయన్నది మా పరిశోధనల సారాంశం. ఉదాహరణకు సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ గుండె జబ్బులకు మార్కరేగానీ.. మొదటి మూడు వారాల్లోపు కూడా ఇవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు? తొలిదశలోనే పర్యావరణానికి, ఆహారానికి, లేదా మరేదైనా మార్పునకు ప్రతిగా ఈ వాపు సంబంధ మార్పులు, స్పందనలు కనబడుతుండొచ్చు. మన పరిసరాల్లో, పర్యావరణంలో, ఆహారంలో మార్పులు, ఒత్తిళ్ల వంటివన్నీ శరీరంలో వాపు సంబంధ రసాయనాలను పెంచుతున్నాయని, వాటితో హైబీపీ ఆరంభమవుతోందని అర్థమవుతోంది.*ఈ ‘వాపు సంబంధ మార్పుల’ గురించి మరికాస్త వివరంగా చెబుతారా?1980లలో మనం ఇన్ఫెక్షన్లనే ఎక్కువగా చూసేవాళ్లం. అప్పట్లో ఒత్తిళ్లు, మధుమేహం వంటివేమీ ఈ స్థాయిలో ఉండేవి కావు. ఇప్పుడు అవన్నీకలిసి.. కణస్థాయిలో వాపు ప్రక్రియలను (ఇన్‌ఫ్లమేషన్‌) పెంచుతున్నాయి. ఫలితంగా హైబీపీ పెరుగుతోంది, గర్భవాతం వస్తోంది. ఇన్‌ఫ్లమేషన్‌ అనేది బాహ్య ప్రపంచానికి, దానిలో వస్తున్న మార్పులకు మన శరీరం స్పందించే తీరుకు నిదర్శనం. అదెందుకు స్పందిస్తోంది? ఎందుకంటే దానికి ముప్పు ఎదురవుతోంది కాబట్టి! ఈ ముప్పు నానాటికీ పెరిగిపోతోంది, దీనికి తగ్గట్టుగా మన శరీరం స్పందించే తీరు కూడా మారిపోతోంది. ఈ స్పందన కూడా ఏదో పైపైన కాదు.. ఎక్కడో కణ స్థాయిలో వస్తున్న స్పందన. కాబట్టి మనం ఈ ముప్పునకు, మార్పులకు దూరంగా ఉంటే... అంటే ఒత్తిడిని తగ్గించుకుంటూ, ఆహారం మార్చుకుంటూ... జాగ్రత్తలు తీసుకుంటే ఈ దుష్ప్రభావాలకు, ఫలితాలకు దూరంగా ఉండొచ్చు.

*ఈ దుష్ఫలితాలన్నీ గర్భ సమయంలోనే ఎందుకు బయటపడతాయి?ఎందుకంటే గర్భమనేది ఒక సున్నితమైన సందర్భం. ఈ సమయంలో శరీరం ఓ పువ్వులా స్పందిస్తుంది. ఒక రకంగా దీన్ని శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడే దశ అనుకోవచ్చు. అందుకే మామూలుగా ఎవరికైనా ‘ప్రీడయాబిటీస్‌’ నుంచి పూర్తిస్థాయి మధుమేహం లోకి వెళ్లటానికి 8 ఏళ్లు పడితే.. అదే గర్భిణుల్లో దానికి 8 వారాలు చాలు. ఈ సమయంలో శరీరం ప్రతి చిన్న దానికీ స్పందిస్తుంది. కణస్థాయిలో స్పందిస్తుంది. ఒకప్పుడు గర్భిణులమీద ఇంత ఒత్తిడి లేదు, వాళ్ల ఆహారం ఇలా ఉండేది కాదు, పర్యావరణమూ ఇంత కలుషితమై లేదు.. అందుకే దుష్ఫలితాల రేటు కూడా తక్కువ.*హైబీపీ, గర్భవాతం ఫలితాలు ఎలా ఉంటాయి?హైబీపీ వల్ల తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యమూ దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. హైబీపీ ఇంకా పెరుగుతూ పోయిన కొద్దీ గర్భవాతం వచ్చి.. తల్లికి గుండె పెద్దదవటం, కాలేయం విఫలమవటం మొదలవుతుంది. సరిగా పట్టించుకోకపోతే అంతిమంగా మనిషిని దక్కించుకోవటం కూడా కష్టం కావచ్చు. దీన్నే ‘హెల్ప్‌’ సిండ్రోమ్‌ (హెచ్‌ఇఎల్‌ఎల్‌పి) అంటారు. ఇవన్నీ తల్లి సమస్యలు. ఇక బిడ్డ విషయానికి వస్తే- తొలి వారాల్లో బిడ్డ పెరగటానికి, అవయవాలన్నీ సజావుగా తయారవ్వటానికి చాలా రక్తం, రక్తనాళాలు అవసరం. హైబీపీ పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలు సంకోచించి సన్నబడటం మొదలవుతుంది. దీంతో రక్తం తగినంత అందక.. బిడ్డ ఎదుగుదల కుంటుపడుతుంది. అంటే ఏ వారానికి ఎంత పెరగాలో అంత పెరగదు. దీన్నే ‘స్మాల్‌ ఫర్‌ జెస్టేషనల్‌ ఏజ్‌’ అంటారు. బరువు పెరగరు, ఎదుగుదలసరిగా ఉండదు. దీంతో వీళ్లలో చాలా దుష్ప్రభావాలు పెరుగుతాయి. హైబీపీ పెరుగుతున్న కొద్దీ.. బిడ్డ ఎదుగుదల కుంటుపడుతున్న కొద్దీ.. వైద్యులు ఎప్పుడు కాన్పు చేసేద్దామా? అని చూస్తుంటారు. అంతకు మించిమరో మార్గం కూడా లేదు. సాధ్యమైనంత త్వరగా బిడ్డను బయటకు తెచ్చి.. ఎలాగోలా బయటే సాకటం అవసరం. ఒకవైపు బిడ్డేమో పూర్తిగా పెరగదు, వదిలేస్తే తల్లీబిడ్డలిద్దరికీ దుష్ప్రభావాలు తప్పవు. ఇది వైద్యులకు కూడా పెద్ద సవాలే. ఎంత కాలం వీలైతే అంత కాలం బిడ్డను లోపల ఉంచాలి. అలాగని ఉంచేస్తే కష్టం. కాబట్టి 29 వారాలు దాటాయంటే చాలు.. ఇక గర్భాన్ని ఎంతకాలం కొనసాగించొచ్చో అనుక్షణం చూస్తుంటారు.

*మరి మనం ఏం చెయ్యాలి?

గర్భవాతాన్ని ముందే గుర్తించొచ్చా? తల్లికి హైబీపీ పెరుగుతోందా? అన్నది చూస్తుండటం ముఖ్యం. అమెరికా వంటి దేశాల్లో గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యులను కలుస్తుంటారు కాబట్టి తరచూ బీపీ చూడటం, మార్పులు వస్తుంటే గుర్తించటం తేలిక. కానీ మన దేశంలో గణాంకాలు చూస్తే సగటున 75% గర్భిణులు కాన్పుకు ముందు వైద్యులను కేవలం ఒకే ఒక్కసారి కలుస్తున్నారు. అదీ ఎప్పుడు కలుస్తారో తెలియదు, అప్పటికే హైబీపీ చాలా ఎక్కువ ఉండొచ్చు. లేదూ అప్పటికి లేకపోయినా ఆ తర్వాత మొదలుకావచ్చు. కాబట్టి దీన్ని తేలికగా ముందే గుర్తించే మార్గం ఏదైనా ఉందా? అన్న దిశగా మేం పరిశోధనలు చేశాం. ఎవరికి గర్భవాతం వచ్చే అవకాశం ఉందో ముందుగానే, అదీ కాస్త చౌకగా, తేలికగా గుర్తించే విధానాన్ని మేం గుర్తించాం. దీన్ని ‘బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌’తో కలిసి భారత్‌కు కూడా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.దీన్నే ‘సీరమ్‌ గ్లైకాసిలేటెడ్‌ ఫైబ్రోనెక్టిన్‌’ పరీక్ష అంటారు. వేలి నుంచి రక్తం చుక్క తీసి చేసే పరీక్ష ఇది. దీన్ని గర్భందాల్చిన మొదటి మూడు వారాల్లోనే చెయ్యొచ్చు.. పాజిటివ్‌ వస్తే గర్భిణీ హైబీపీ వచ్చే అవకాశం ఉందని గుర్తించి తర్వాత కూడా తరచుగా గమనిస్తుండటం అవసరం.

*హైబీపీ, గర్భవాతాలను ముందే గుర్తిస్తే మనం ఏం చెయ్యగలం?నిజం చెప్పాలంటే ముందే గుర్తించినా.. మనం మరింత తరచుగా పరిస్థితిని గమనిస్తుండటం తప్పించి పెద్దగా చెయ్యగలిగిందేం లేదు. తక్కువ మోతాదు ‘ఆస్పిరిన్‌’ ఇవ్వటం వల్ల కొంత వరకూ మిశ్రమ ఫలితాలుంటున్నాయి. ‘మెగ్నీషియం సల్ఫేట్‌’ ఇవ్వటం వల్ల వీరిలో నెలలు నిండక ముందే కాన్పు రాకుండా చూడటం సాధ్యమవుతోందని గుర్తించారు. కానీ మొత్తానికి గర్భవాతాన్ని నయం చేసే ఇదమిత్థమైన, సమర్థమైన చికిత్స ఇప్పటికీ లేదనే చెప్పాలి. పెద్దల్లో బీపీ తగ్గించేందుకు వేసే మందులన్నీ గర్భిణులకు వెయ్యటానికి వీల్లేదు. అందుకే వైద్యులంతా కూడా గర్భిణిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ.. అవసరానికి తగ్గట్టుగా చికిత్స అందిస్తుంటారు.సాధ్యమైనంత త్వరగా సజావుగా కాన్పు చెయ్యటం మీదే దృష్టి పెడుతుంటారు.ఈ పని ఎప్పుడు చేస్తే మేలన్నది గుర్తించేందుకు కూడా కొన్ని పరీక్షలువచ్చే అవకాశం ఉంది. వాటివల్ల మనం ముందే అంతా సిద్ధపడి, సత్వరమే కాన్పు చేసే వీలుంటుంది. అయితే కాన్పు చెయ్యగానే సరిపోదు కదా. ఆ బిడ్డలను ఇంక్యుబేటర్లలో పెట్టి.. వాళ్ల వూపిరితిత్తులు పరిపక్వమయ్యే వరకూ చూసుకుంటూ వాళ్లను దక్కించుకోవటానికి మనం చాలా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ సమస్యలే. బహుశా రానున్న పదేళ్ల పాటు పరిశోధనా రంగం దీని మీదే ఎక్కువగా దృష్టి సారించొచ్చు. అందుకే ప్రస్తుతానికి అసలీ హైబీపీ, గర్భవాతాల వంటివేవీ రాకుండా.. నివారించుకోవటం, ముందు నుంచే అందుకు అనుగుణమైన ఆరోగ్యకరమైన జీవనశైలి మీద దృష్టిపెట్టటం అవసరమని భావిస్తున్నాం. ప్రస్తుతానికి మన ముందున్న ఉత్తమ మార్గం అదే.

*హైబీపీ వంటివి నివారించుకోవటానికి ఏం చెయ్యొచ్చు?ఆహారపరంగా, జీవనశైలి పరంగా, ఒత్తిడి పరంగా.. మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇన్‌ఫ్లమేషన్‌కు దూరంగా ఉంటాం. దాంతో చాలా వరకూ హైబీపీ,మధుమేహం వంటివాటిని నివారించుకునే వీలుంటుంది. ఒకప్పుడు మన తల్లులకూ,అమ్మమ్మలకూ ఇన్ని ముప్పులు లేవు. అందుకే ఇప్పుడు మనం కాస్త వెనక్కి వెళ్లి.. మన సమాజంలో, మన సంస్కృతిలో ఉన్న మంచి గుణాలను అలవరచుకోవటం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. గర్భవాతం విషయంలో ఒత్తిడి పాత్ర చాలా ఎక్కువ. కాబట్టి ఒత్తిడిని నివారించేందుకు మన భారతీయ వైద్యంలోయోగా వంటివి ఏవి ఉన్నా.. వాటన్నింటినీ ఆచరించటం అవసరమని గుర్తించాలి. భవిష్యత్తులో చాలా మందులు రావచ్చు.. చాలా చికిత్సలు రావచ్చు.. కానీ ఇవాల్టి తల్లులనూ, పిల్లలనూ ఆదుకునేదెలా? అందుకే ఒత్తిడిని తగ్గించుకుని, ఆహారాన్ని సరిచేసుకుని నివారణ మీద దృష్టిపెట్టటం ముఖ్యమని నా అభిప్రాయం.ఈ నివారణ జాగ్రత్తలను గర్భం ధరించక ముందు నుంచే ప్రారంభించటం మంచిది. బరువు ఎక్కువగా ఉంటే తగ్గటం ఉత్తమం. బరువు ఎక్కువగా.. అంటే బీఎంఐ 25 కంటే ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి. ఒత్తిడి ఉంటే తగ్గించుకోవాలి.


Share on

మీకు పుట్టబోయే బిడ్డ కోసం ఆహార నియమాలు

ఫ్రతి స్త్రీకి నూటికి నూరు మార్కులు వచ్చేది సంతాన ప్రాప్తితోనే. ఏది ఏమైనా సంతానం లేకపోతే బ్రతకలేనంటుంది. సంతానం పోందేందుకు ఎన్ని కష్టనష్టాలనైనా ఓర్పుతో సహించి నిండు మాసాలూ బరువు మోసి ఓ ప్రాణాన్ని ఇలలోనికి తెస్తుంది. మరి ఆ బిడ్డ పుట్టేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలేమితో చూద్దామా..గర్భం దాల్చారని తెలుసుకునేలోపే మూడు నెలలు గడిచిపోతాయి. చాలా మంది విషయంలోనూ ఇలానే జరుగుతుంది. కొంత మంది మాత్రం ప్రెగ్నెసీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడతారు. నిజానికి అలా చేయడం చాలా ముఖ్యం. హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకు మందులు వాడుతూ ప్రెగ్నెసీ కోసం ప్రయత్నించాలి.

గర్భం దాల్చాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. మొదటి 3 నెలల్లో అదనపు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సమతుల ఆహారం తీసుకోవాలి. గర్భం దాల్చిన వారికి ఫోలిక్ ఆసిడ్, ఐరన్ చాలా అవసరం. కాబట్టి ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. క్యాబేజీ, బత్తాయి, ఖర్జూర, మాంసాహారం తీసుకుంటే మంచిది. అలాగే హీమోగ్లోబిన్ శాతం సరియైన స్థాయిలో ఉందో లేదో పరీక్ష చేయించుకోవాలి. ఐరన్ కోసం డేట్స్ తీసుకోవచ్చు. ఈ మొదటి 3నెలల సమయంలో అదనపు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ వెయిట్ ఉండేలా చూసుకోవాలి.

ఈ సమయంలో కూడా అదనపు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. సమతుల ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అలాగే బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతి రోజు ధాన్యపు గింజలు, రాగులతో చేసిన ఆహారం తీసుకోవాలి. రాగులలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా దొరుకుతుంది. తాజా పండ్లు తీసుకోవడం కూడా చాలా అవసరం. పాలు, పెరుగు తప్పకుండా తీసుకోవాలి. పాల ఉత్పత్తులను ప్రతి రోజు 300 ఎంఎల్ తీసుకుంటే గర్భిణిలకు చాలా మంచిది. ప్రోటీన్స్ సమృద్ధిగా లభ్యమయ్యే పప్పుధాన్యాలు, మాంసాహారం, చేపలు, గుడ్లు మెనూలో ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ పదార్థాలు, స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి.

ఈ సమయంలో బిడ్డ పెరుగుదల వేగంగా ఉంటుంది. ఇప్పుడు బిడ్డకు కూడా ఆహారం అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అదనపు ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో బరువు తగ్గడం మంచిది కాదు. బరువును ఎప్పటిక ప్పుడు చెక్ చేసుకుంటూ సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. చివరి 3 నెలల సమయంలో చాలా మందికి ఒంటికి నీరు పడుతుంది. అలాంటప్పుడు బార్లీ నీళ్లు, నిమ్మరసం తీసుకుంటే ఒంటికి పట్టిన నీరు తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ పళ్లు తినాలి. ఫోలిక్ఆసిడ్, ఐరన్ చాలా అవసరం కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లభ్యమయ్యే ఆహారపదార్ధాలు తీసుకోవడం అవసరం. ఉదయం పూట సిక్‌నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా జీర్ణమయ్యే ఇడ్లీ , పండ్లు లాంటివి తీసుకోవచ్చు. ఆయిల్ పదార్థాలు తీసుకోకూడదు. పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. చాలా కీలకమైన ఈ సమయంలో డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తల్లి ఆరోగ్యం బాగుండటంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved